KCR Sankranti wishes : తెలంగాణ వ్యవసాయరంగం విప్లవాత్మక ప్రగతి దేశమంతటికీ విస్తరించి సంపూర్ణ క్రాంతి సిద్ధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. యావత్ భారత ప్రజల సహకారంతో దేశ వ్యవసాయరంగ నమూనాను మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం రాష్ట్ర రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదుగొల్పుతామని చెప్పారు. దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
KCR wishes on Sankranti : ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ‘‘పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో చేసుకునే పండుగే సంక్రాంతి. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలిపే శుభదినమిది. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి దేశానికి మార్గదర్శనంగా నిలిచింది. సాగు బలోపేతం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రమిది." అని కేసీఆర్ తమ సందేశంలో తెలిపారు.