దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై శాసనసభలో (telangana monsoon assembly session 2021) చర్చ జరిగింది. తొలుత చర్చను చేపట్టిన తెరాస శాసనసభ్యుడు గాదరి కిశోర్.. ఇది దళిత జనోద్ధరణ ఉద్యమమని పేర్కొన్నారు. ఇది పథకం కాదని.. విప్లవమని అభిప్రాయపడ్డారు. చర్చలో భాగంగా మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... ఈ పథకానికి నిధులెలా తెస్తారో వివరించాలని కోరారు. నిధుల కొరత ఉంటే కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళితే భాజపా మద్దతిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు.
లక్షా 80 వేల కోట్లు పెద్ద లెక్క కాదు..
దళిత బంధుపై సభకు వివరణ ఇచ్చిన కేసీఆర్.. పథకానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందన్నారు. క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో పథకం అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి.. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి ఆర్థికసాయం (CM KCR ON DALIT BANDHU) చేస్తామని తెలిపారు. 10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చన్నారు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చని సూచించారు. దళితబంధు నిధులతో పలానా పనే చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదన్నారు. దళితబంధు పథకానికి దాదాపు ఇప్పుడు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లతో.. నియోజకవర్గానికి 2 వేల మందికి దళిత బంధు అమలు చేస్తామన్నారు.
"రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నా. దళితబంధు (CM KCR ON DALIT BANDHU)పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైంది. క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన మాకు ఉంది. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని అనుకున్నాం. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉంది. అమలులో కనిపించే లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకెళ్తాం. రాష్ట్రంలో నాలుగు మూలల, విభిన్నమైన 4 మండలాలను ఎంపిక చేశాం."- సీఎం కేసీఆర్
'వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తాం..'
దళితబంధు పథకం హుజూరాబాద్ ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదని కేసీఆర్ (kcr latest speech)స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడిన డబ్బులు వెనక్కి వెళ్తాయని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కలలు కన్నా.. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచేది తామేనని.. భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు సీఎం కేసీఆర్ చురకలంటించారు.
"రఘునందన్ రావుకి చాలా పెద్ద సందేహం వచ్చింది. ఒక్క హుజూరాబాద్‌కే విడుదల చేసిండ్రా.. వీటికి కూడా విడుదల చేసిండ్రా అని చెప్పి... ఇది ప్రభుత్వం రఘునందన్ రావు. మాకు చాలా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం. ముందర కూడా మేమే ఉంటాం. మీరు ఉండేదేందో సచ్చేదేందో. మాకు అన్ని అంచనాలు ఉన్నాయి. కొంతమందికి ఏదో ఈస్ట్‌మన్ కలర్ డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ మాది రాజకీయ పార్టీయే కదా మాదేమన్న మఠమా? మాకు తెల్వదా మాకు అంచనాలు, సర్వేలు ఉండవా? భవిష్యత్‌లో కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుంది అందులో అనుమానం ఎందుకు? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎందుకు పక్కన పెడతరు? ఏం కారణం చేత పక్కన పెడతరు. నేను అందుకే చెప్పిన మాకు ఆత్మ విశ్వాసం ఉందని. ఈ నాలుగు మండలాలకు రూ. 1,500 కోట్లు ఖర్చు అవుతాయి. మొదట్లో పెట్టుకున్న రూ. 1,000 కోట్లు కూడా ఖర్చు అవుతాయి. అంటే సుమారు 3వేల కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం మార్చిలోపల అమలవుతుంది." - కేసీఆర్, ముఖ్యమంత్రి
'బీసీ గణన జరగాలి..'
'రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64 శాతం ఎస్సీ జనాభా ఉందన్నారు. అనేక జిల్లాల్లో దళితుల జనాభా 20 శాతం దాటిందని పేర్కొన్నారు. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 17.53 శాతం మాత్రమే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనని (KCR ON BC CENSUS) ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కులగణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని శాసనసభ వేదికగా సీఎం పేర్కొన్నారు.'