రాయలసీమను రతనాలసీమ మార్చేందుకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందని అన్నారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను వాడుకుంటే బంగారు పంటలు పండుతాయని పేర్కొన్నారు. ఏపీకి యువ నాయకుడు, పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారని... రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి జగన్తో కలిసి సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. తమిళనాడు కంచిలోని అత్తివరదరాజు స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం రోజా నివాసానికి వెళ్లారు.
సీఎం కేసీఆర్ తమిళనాడు కాంచీపురంలోని అత్తి వరదరాజు స్వామి దర్శనం కోసం ఆయన సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి ప్రత్యేక విమానంలో ఏపీలోని రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి వెళ్లారు. నగరిలో ఎమ్మెల్యే రోజా సీఎం కేసీఆర్కు స్వాగతం పలికారు. వారితో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు తీర్థప్రసాదాలు అందించారు.