మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పదని రామాయణంలో వాల్మీకి చెప్పిన సూక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రజలకు ఆయన పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరూ నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానం పెంచుకుని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి: కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు
ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమిని, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నేలతల్లి బాగుంటేనే... మనతో పాటు భావితరాలు బాధలేకుండా జీవించగలుగుతారని తెలిపారు.
కాలుష్యరహితంగా పరిశుభ్రంగా, పచ్చదనంతో పరిసరాలను ఉంచేందుకు కృషిచేయాలన్నారు. తెలంగాణను పచ్చగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా పరిశుభ్రత-పచ్చదనం కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని వెల్లడించారు. తాగునీరు, సాగునీరు లేక కరవు కాటకాలతో అల్లాడిన తెలంగాణ నేలలో... నేడు అడుగడుగునా జీవ జలం ప్రవహిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నీటి లభ్యత పెరగటం ద్వారా పంటలకు, మనుషులకే కాకుండా పశు పక్షాదులకు మేలుజరిగి తెలంగాణ నేలమీద ప్రకృతి సమతుల్యత సాధించగలిగామన్నారు.