కృష్ణా నది నుంచి రోజుకు 10 టీఎంసీల నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హాజరయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీరు లిఫ్టు చేసేందుకు కొత్త ఎత్తిపోతల పథకానికి ఏకపక్షంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
"ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధం. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో ఫిర్యాదు చేస్తాం. బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించా. శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించింది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీపడే ప్రసక్తే లేదు."