తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: 'కేసు ఉపసంహరించుకున్నాం.. గెజిట్‌ అమలుకు సహకరిస్తాం' - తెలంగాణ తాజా వార్తలు

cm kcr
cm kcr

By

Published : Sep 6, 2021, 7:16 PM IST

Updated : Sep 7, 2021, 3:13 AM IST

19:14 September 06

కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కృష్ణానదీ నీటి పంపిణీ కోసం అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణాట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మీరు చేసిన సూచన మేరకు కృష్ణా ట్రైబ్యునల్‌పై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకున్నందున ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలని విన్నవించారు. ఏడేళ్లుగా కేంద్రం స్పందించక పోవడంతోనే ‘సుప్రీం’ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 89లో నీటి పంపకాలకు పరిమిత అవకాశాలే ఉన్నాయన్నారు. ఆ సెక్షన్‌ ప్రకారం ట్రైబ్యునల్‌కు ప్రతిపాదిస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున జల వివాదాల చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం విధివిధానాలను ఖరారు చేయాలని కోరారు.  దీన్ని అనుసరించి ఆ బాధ్యతలను ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కు అప్పగించినా, కొత్తది ఏర్పాటుచేసినా అభ్యంతరం లేదన్నారు.

 సోమవారం రాత్రి 7.10 - 8.40 గంటల వరకు వీరి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ బేసిన్‌ బయటకు కృష్ణా నీటిని తరలిస్తోందని.. బేసిన్‌లోని ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి కోసమే పరిగణనలోకి తీసుకోవాలని కూడా కోరినట్లు తెలిసింది. ఇటీవల జారీచేసిన కృష్ణా, గోదావరి యాజమాన్య మండళ్ల నోటిఫికేషన్లు విస్తృతస్థాయిలో ఉన్నాయని, వాటిని అర్థం చేసుకొని అమలు చేయడానికి అధికారులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున అక్టోబరు 14 నుంచి (అపాయింటెడ్‌డే)అమల్లోకి తేకుండా మరికొంత వెనక్కు జరపాలని సీఎం కోరినట్లు సమాచారం. ఆ రెండు బోర్డులకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంత త్వరగా అమలు సాధ్యంకాదని అభిప్రాయపడినట్లు తెలిసింది. 

రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఈఎన్‌సీ మురళీధర్‌, కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్‌లతో కలిసి కేంద్రమంత్రితో కేసీఆర్‌ సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వం తరఫున జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు. అందులో ఏం పేర్కొన్నారంటే..

ఆ ప్రాజెక్టులు రాష్ట్రం ఏర్పడక పూర్వం చేపట్టినవే

  • సెప్టెంబరు 7న జారీ చేసిన నోటిఫికేషన్‌లో గోదావరి బోర్డు పేర్కొన్న అనుమతిలేని జాబితా నుంచి తెలంగాణలోని 11 ప్రాజెక్టులను తొలగించాలి. అవన్నీ రాష్ట్రం ఏర్పడక పూర్వం చేపట్టినవే. రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీల పరిధిలోకే వస్తాయి. ఇందులో 758.76 టీఎంసీల ప్రాజెక్టులకు ఇప్పటికే సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసింది. మరో 148.82 టీఎంసీల నీటి లభ్యతకు సంబంధించి హైడ్రాలజీ డైరెక్టరేట్‌ అనుమతి ఇచ్చింది. మిగిలిన 60.26 టీఎంసీలను మాత్రం భవిష్యత్తు ప్రాజెక్టులు, ఆవిరి నష్టాల కోసం కేటాయించాం.
  • గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డుతో పాటు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని అనుసరించి ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు 85 టీఎంసీలు కేటాయించారు. ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌లకు 16 టీఎంసీల చొప్పున కేటాయిస్తూ ఇదివరకే సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. దేవాదుల ఎత్తిపోతలకు 38 టీఎంసీలు కేటాయించారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులన్నీ ఇదివరకే పొందారు. ఈ నాలుగింటికి కలిపి 155 టీఎంసీల నీటి కేటాయింపులకు సీడబ్ల్యూసీ అనుమతులున్నాయి. వీటికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం70 టీఎంసీల కేటాయింపులతో సీతారామ ప్రాజెక్టు, 60 టీఎంసీల కేటాయింపులతో దేవాదుల ఎత్తిపోతల (తుపాకుల గూడెం వద్ద బ్యారేజ్‌తో), 4.5 టీఎంసీలతో ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం), 3 టీఎంసీలతో రామప్ప-పాకాల లింక్‌, 2.14 టీఎంసీలతో మోదికుంటవాగు, 0.8 టీఎంసీలతో చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టులు తలపెట్టింది. వీటన్నింటికీ కలిపి 140.44 టీఎంసీలు సరిపోతాయి. మిగిలిన 14.56 టీఎంసీలు రిజర్వ్‌లో ఉంచాలనుకుంటున్నాం. సీడబ్ల్యూసీ కేటాయింపులకు లోబడే తెలంగాణ ఈ ప్రాజెక్టులను చేపడుతోంది. అందువల్ల వీటి డీపీఆర్‌లకు వేగంగా ఆమోదించండి.
  • కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 1 టీఎంసీ అదనంగా వాడుకోవడం అన్నది అదనం కిందకు కానీ, కొత్త దాని కిందకు కానీ రాదు. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ కేటాయించిన 240 టీఎంసీల నీటిని స్వల్పకాలపరిధిలో వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో దీన్ని చేపట్టింది. అందువల్ల కేంద్ర అనుమతులేమీ అవసరంలేదు. కేవలం 3,300 ఎకరాలే అయకట్టు ఉన్న కందకుర్తి ఎత్తిపోతల గురించి కేంద్రానికి నివేదించాల్సిన పని లేదు. రామప్ప-పాకాల లింక్‌, తుపాకులగూడెం బ్యారేజీలు దేవాదుల ప్రాజెక్టులో అంతర్భాగం కాబట్టి వాటికీ కొత్తగా అనుమతులు అవసరం లేదు. గూడెం ఎత్తిపోతల పథకం ఇప్పటికే ఆమోదం పొందిన కడెం ప్రాజెక్టులో అంతర్భాగం. చిట్టచివరి ప్రాంతాల ప్రయోజనాలను కాపాడటానికి నిర్మిస్తున్నందున దీనికీ కేంద్ర ఆమోదం అవసరం ఉండదు. కాంతానపల్లి ప్రాజెక్టు ఇదివరకు మనుగడలోనే లేదు కాబట్టి దాన్ని అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలోంచి తొలగించాలి. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకొనేలా కేంద్ర ప్రభుత్వం గోదావరి బోర్డు, సీడబ్ల్ల్యూసీకి ఆదేశాలివ్వాలి.

ఇదీ చూడండి:కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం కేసీఆర్‌

Last Updated : Sep 7, 2021, 3:13 AM IST

ABOUT THE AUTHOR

...view details