తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR meet Modi : మోదీకి సీఎం కేసీఆర్ అందించిన పది లేఖల్లో ఏముంది? ప్రధాని స్పందనేంటి? - telangana varthalu

తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని సీఎం కేసీఆర్​ ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో ప్రధానితో భేటీ అయిన సీఎం... పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి సహకారాన్ని కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధిక కల్పన, మెరుగైన ఆర్థికాభివృద్ధి కోసం హైదరాబాద్‌-నాగ్‌పూర్‌, హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక నడవాలు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు.అక్టోబర్ లేదా నవంబర్​లో యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారు.

telangana-cm-kcr-meets-pm-modi-invites-for-renovated-yadadri-temples-inauguration
telangana-cm-kcr-meets-pm-modi-invites-for-renovated-yadadri-temples-inauguration

By

Published : Sep 4, 2021, 2:59 AM IST

Updated : Sep 4, 2021, 7:01 AM IST

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి సహకారాన్ని కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి కల్పన, మెరుగైన ఆర్థికాభివృద్ధి కోసం హైదరాబాద్‌-నాగ్‌పుర్‌, హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక నడవాలు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రధానమంత్రిని ఆయన అధికారిక నివాసం 7, లోక్‌కల్యాణ మార్గ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. సాయంత్రం 4.55 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి 5.47 గంటలకు బయటకు వచ్చారు. సుమారు 52 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. అన్ని రాష్ట్రాలకు దేశ రాజధానిలో ప్రభుత్వ భవనాలు ఉన్నందున తెలంగాణకు కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం ‘తెలంగాణ భవన్‌’ నిర్మించుకునేందుకు అనువైన చోట స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి కోరగా ప్రధాని అంగీకరించి ఆ మేరకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తికావస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అక్టోబరు, నవంబరు నెలల్లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరవుతానని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పది లేఖలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానికి అందజేశారు. వాటిలో అనేక అంశాలను సవివరంగా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కలవనున్నారు.

వినతుల్లో సవివరంగా...
దిల్లీ-ముంబయి పారిశ్రామిక నడవా తరహాలో హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ మధ్య 585 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ పారిశ్రామిక నడవా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో దేశానికి కేంద్ర స్థానంలో ఉన్న నాగ్‌పుర్‌ను మల్టీమోడల్‌ ఇంటర్నేషనల్‌ కార్గోహబ్‌గా, హైదరాబాద్‌ను ప్రధాన ఐటీ, తయారీరంగ గమ్యస్థానాలుగా మార్చవచ్చు. ఈ నడవాలో సరకు రవాణా, ప్రయాణికుల కోసం హైస్పీడ్‌ రైల్వేమార్గాన్ని నిర్మించవచ్చు. ఇప్పుడున్న ఎన్‌హెచ్‌-44 ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని 6/8 వరుసలుగా విస్తరించి ఎక్స్‌ప్రెస్‌ వేగా ఉపయోగించుకోవచ్చు. ఈ నగరాల మధ్య విమాన అనుసంధానం బాగుంది. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఈ నడవాకు అదనపు సొబగు. ఈ కారిడార్‌ మార్గంలో చేపట్టే రైలు, రోడ్డు మార్గానికి అటు, ఇటు 50 కిలోమీటర్లపై తక్షణ ప్రభావం ఉంటుంది. ఈ పరిధిలో 4 కోట్ల మంది ప్రజలు ఉంటారు. తెలంగాణ, మహారాష్ట్ర జనాభాలో ఇది 27%. ఈ పారిశ్రామిక నడవా అభివృద్ధి చెందిన, చెందుతున్న, ఇప్పటివరకూ చెందని ప్రాంతాల మీదుగా సాగుతుంది. ఇక్కడ పారదర్శకంగా, పెట్టుబడి అనుకూలమైన విధానాలతో అత్యధిక ప్రభావితం చూపే, మార్కెట్‌ ప్రభావిత నోడ్స్‌ నిర్మించవచ్చు. వాటి పరిధిలో సమీకృత పెట్టుబడి ప్రాంతాలు (ఇంటిగ్రేటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్స్‌), పారిశ్రామిక ప్రాంతాలు (ఇండస్ట్రియల్‌ ఏరియాస్‌) ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పారిశ్రామిక టౌన్‌షిప్పులు, సరకు రవాణాకు రహదారి, రైలు అనుసంధానత, జాతీయ, అంతర్జాతీయ విమాన అనుసంధానత, నాణ్యమైన విద్యుత్తు, సామాజిక మౌలిక వసతులు, వ్యాపారాలకు మంచి వాతావరణం కల్పించవచ్చు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌-హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ విభాగం కూడా నాగ్‌పుర్‌-హైదరాబాద్‌ రైల్వే మార్గం, హైదరాబాద్‌-భూపాలపట్నం మధ్య రోడ్డుతో అనుసంధానమవుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌-నాగ్‌పుర్‌, వరంగల్‌-హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ ప్రాజెక్టులను మంజూరు చేయాలి. దాంతో వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధికల్పనపై విస్తృత ప్రభావం చూపడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

వరంగల్‌ జౌళి పార్క్‌కు రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి
వరంగల్‌లో కనీసం రెండు వేల ఎకరాల్లో అత్యాధునిక వసతులతో కూడిన టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అక్కడే దారం నుంచి దుస్తుల వరకు అన్నిరకాల జౌళి ఉత్పత్తులు తయారు చేయాలనేది లక్ష్యం. గృహవసతి, ఇతర పౌరవసతి సేవలు ఉండేలా ఈ పార్క్‌ను టౌన్‌షిప్‌ పద్ధతిలో ప్రతిపాదించాం. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నందున ముడి సరకుతో పాటు నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. జౌళిరంగం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయి. ఆ పార్క్‌ కోసం ఇప్పటికే వెయ్యి ఎకరాలు సేకరించాం. మిగతాది త్వరలో పూర్తవుతుంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి కాకుండా కేంద్రీకృత శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. దేశంలో ఇలాంటి కేంద్రం ఎక్కడా ఉండదు. ప్రస్తుతం డీపీఆర్‌ తయారీదశలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని ఏర్పాటు చేయడానికి రూ.1,600 కోట్ల పెట్టుబడి అవసరం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి. మిగతా వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుంది.

21 జవహర్‌ నవోదయ విద్యాలయాలు కావాలి
తెలంగాణలో ప్రస్తుతం 9 జిల్లాల్లో మాత్రమే జవహర్‌ నవోదయ విద్యాలయాలున్నాయి. కొత్తగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరిల్లో 21 కొత్త విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. జవహర్‌ నవోదయ విద్యాలయాలు మాధ్యమిక, మాధ్యమికోన్నత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తాయి. ఈ జిల్లాల్లో విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తక్షణం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి.

200 ఎకరాల భూమి గుర్తించాం..
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుచేయాలి. ఇందుకు వరంగల్‌ సమీపంలో 200 ఎకరాల భూమి గుర్తించాం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆ భూమిని చూసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అంగీకరించారు. కానీ ఇప్పటివరకు దాని ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు ఆమోదించలేదు. బడ్జెట్‌ కేటాయించలేదు, తక్షణం దీని ఏర్పాటుకు ఆదేశించండి.

హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు...
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కొత్తగా 10 ఐఐఎంలు మంజూరు చేసింది. హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఉందంటూ తెలంగాణకు ఐఐఎం కేటాయించలేదు. ఐఎస్‌బీ స్వీయ ఆర్థిక వనరులతో నడుస్తున్న లాభాపేక్షలేని ప్రైవేటు సంస్థ. అక్కడ అసాధారణమైన ఫీజులు ఉన్నందున సాధారణ విద్యార్థులు అందులో చదవలేరు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలో రెండు వేలకుపైగా ఎకరాల భూమి ఉన్నందున అక్కడ ఐఐఎంకు అవసరమైన భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడ ఐఐఎం ఏర్పాటు చేసేలా ఆదేశించండి.

కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ
హైదరాబాద్‌కు 165 కిలోమీటర్ల దూరంలో, మంచి రోడ్డు అనుసంధానతతో ఉన్న కరీంనగర్‌లో పీపీపీ విధానంలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యున్నత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే వాతావరణం ఉంది. వరంగల్‌లో ఇప్పటికే ఎన్‌ఐటీ ఏర్పాటైంది. అందుకే కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నా. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూ కేటాయింపుతో పాటు పీపీపీ విధానంలో తనవంతు వాటా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు అందులో భాగస్వాములయ్యేలా మేం తగిన చర్యలు తీసుకుంటాం. కరీంనగర్‌కు సాధ్యమైనంత త్వరగా ట్రిపుల్‌ ఐటీ మంజూరు చేయాలి.

రహదారుల విస్తరణకు...
ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద తెలంగాణకు దాదాపు 4 వేల కిలోమీటర్ల రహదారులు కేటాయించే అవకాశం ఉంది. ఆ మొత్తం రోడ్లను 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు వీలు కల్పించండి.

అదనపు నిధులు...
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 9, 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న దాని ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రహదారి అనుసంధానం పెంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఈ అంశం కేంద్ర రహదారి, రవాణా శాఖ పరిధిలోకి రాదు కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవడానికి ఆ శాఖ నిస్సహాయత వ్యక్తం చేసింది. విభజన చట్టంలో చెప్పినట్లు తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారి అనుసంధానం మెరుగుపర్చడానికి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద అదనపు నిధులు కేటాయించాలి.

వంద శాతం కేంద్ర నిధులతో...
కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారులు మంజూరు చేస్తోంది. భద్రతా దళాలు చేరుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఈ రోడ్లు కీలకం. అంతర్గత భద్రత జాతీయ ప్రాధాన్యాంశంగా మారింది. సాధారణ శాంతిభద్రతల అంశం కంటే ఇది కీలకం. అందువల్ల ఈ రహదారుల నిర్మాణాన్ని కేంద్ర ప్రాయోజిత పథకం పద్ధతి కింద 60:40 నిష్పత్తిలో కాకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలి.

ప్రధానికి నివేదించిన మరికొన్ని ముఖ్య అంశాలు

  • అత్యాధునిక సమీకృత టైక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు
  • 21 నవోదయ విద్యాలయాలు హైదరాబాద్‌లో ఐఐఎం
  • కరీంనగర్‌లో ఐఐఐటీ
  • వరంగల్‌లో గిరిజన విశ్వ విద్యాలయం
  • పీఎంజీఎస్‌వై విస్తరణ
  • అదనపు నిధుల కేటాయింపు
  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం

ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులను 139 నుంచి 194కి పెంచాలి

రాష్ట్రంలో 33 కొత్త రెవెన్యూ జిల్లాలు, 20 పోలీస్‌ జిల్లాలు, 9 పోలీస్‌ కమిషనరేట్లు, 7 పోలీస్‌ జోన్లు, 2 పోలీస్‌ మల్టీజోన్లు ఏర్పాటు చేసినందున కొత్తగా ప్రాదేశిక చట్టబద్ధమైన పోస్టులు సృష్టించాల్సి వచ్చింది. అందువల్ల ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులను 139 నుంచి 194కి పెంచాల్సి ఉంది. మొత్తం కేడర్‌ బలాన్ని సాధారణంగా అనుమతి ఇచ్చే 5% పెంపునకు పరిమితం చేయకుండా 40%మేర పెంచాలి. తెలంగాణ పోలీస్‌ కేడర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు పంపాం. ఈ మేరకు కేటాయింపులు జరిపితే ఐపీఎస్‌ అధికారులను కమిషనర్లు, ఎస్పీలు, జోనల్‌ డీఐజీ, మల్టీజోనల్‌ ఐజీపీలుగా నియమించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాదేశిక యూనిట్లకు శాంక్షన్డ్‌ కేడర్‌ పోస్టులు లేవు. అందువల్ల ఐపీఎస్‌ కేడర్‌ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించి ఆమోదముద్ర వేయాలి. సీనియర్‌ డ్యూటీ పోస్టుల సంఖ్యను 76 నుంచి 105కి పెంచాలి. మొత్తం ఐపీఎస్‌ల అధీకృత సంఖ్యను 194కి చేర్చాలి.

ఇదీ చదవండి: modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్​

Last Updated : Sep 4, 2021, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details