దేశ రాజధాని దిల్లీలో తెరాస కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒంటిగంట 48 నిమిషాలకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇతర నేతలు నిన్ననే దిల్లీకి చేరుకున్నారు. గతేడాది అక్టోబరు 9న దిల్లీ వసంత విహార్ వద్ద తెరాసకు 1,100 చదరపు మీటర్ల భూమిని కేటాయించిన కేంద్రప్రభుత్వం... గతేడాది నవంబరు 4న తెరాసకు కేంద్రం భూమిని అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా వేచి ఉన్న తెరాస.. ఇవాళ మంచి ముహూర్తంగా భావించి భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
దిల్లీ గడ్డపై గులాబీ పతాకం..
దిల్లీలో తెరాస భవనం తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి చిహ్నమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఊపిరిపోసుకున్న తెరాస.. నేడు దిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజచేయడం చారిత్రక ఘట్టమని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమం, తెరాస పార్టీ.. చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుందని కేటీఆర్ అన్నారు. సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో తెరాస ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని.. అనేక అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగిందని గుర్తుచేశారు. ఏడేళ్ల స్వయం పాలనలో, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని వివరించారు.
తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ.. ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుంచి మహత్తరమైన పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న ఆచార్య జయశంకర్ మాట స్ఫూర్తిగా.. దిల్లీ గడ్డపై గులాబీ పతాకం రెపరెపలాడటం ప్రతీ తెలంగాణ బిడ్డకు భరోసా ఇస్తుందని తెలిపారు. దిల్లీలో కార్యాలయం ఏర్పాటుచేసిన రెండో ప్రాంతీయ పార్టీగా తెరాస నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు