Police Command Control Centre: దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. కమాండ్ కంట్రోల్ నమూనాను పరిశీలించారు. కేంద్రంలో మంత్రులు, అధికారులతో కలిసి కలియ తిరిగారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన కేసీఆర్.. నేటి నుంచి అందుబాటులోకి.. - జూబ్లీహిల్స్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
10:25 August 04
Police Command Control Centre : పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలు ఏర్పాటు చేశారు. టవర్-ఏలో 20 అంతస్థులు నిర్మించారు. ఇందులోని నాలుగో అంతస్థులో డీజీపీ ఛాంబర్, ఏడో అంతస్థులో సీఎం, సీఎస్ ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్థులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది.
టవర్-ఏపై హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. టవర్-బీని 15 అంతస్థులతో నిర్మించారు. ఇందులో పూర్తిగా పోలీస్ శాఖకు సంబంధించిన సాంకేతిక విభాగాల కార్యాలయాలు ఉండనున్నాయి. డయల్ 100, షీ టీమ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైం కార్యాలయాలు టవర్-బీ నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.
అన్నీ ఇక్కడి నుంచే..: టవర్-ఈలో కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పలు శాఖలను సమన్వయం చేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించడానికి.. 4, 5, 6 అంతస్థుల్లో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని అన్ని సీసీటీవీ కెమెరాలతో పాటు.. రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించనున్నారు.