తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం నుంచి నయాపైసా కూడా సాయం అందలే: కేసీఆర్​ - KCR latest news

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వరద సాయంపై ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.

KCR fire on the central government
కేంద్రం నుంచి నయాపైసా కూడా సాయం అందలే: కేసీఆర్​

By

Published : Nov 7, 2020, 9:00 PM IST

Updated : Nov 7, 2020, 9:29 PM IST

భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా.. కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయకపోవడం దారుణమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అన్న విషయం మరోమారు నిరూపణ అయిందని వ్యాఖ్యానించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్​కు నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్న ఆయన... ఈ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్ష కేంద్ర ప్రభుత్వ వరద సాయం అంశం ప్రస్తావనకు వచ్చింది. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తి అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగిందన్న అధికారులు... దాదాపు 5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు చెప్పారు. 1350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ అక్టోబర్ 15న లేఖ రాసినట్లు పేర్కొన్నారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి దిగ్భాంతి వ్యక్తం చేశారని... ముఖ్యమంత్రితోనూ స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారని చెప్పారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసిన తర్వాత కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించామన్న ఆర్థికశాఖ అధికారులు... కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని తెలిపారు.

ఇదీ చదవండి:అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​

Last Updated : Nov 7, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details