CM KCR on Ambedkar Jayanti: రాష్ట్రంలోని సబ్బండ కులాలు, మహిళలు, పేద వర్గాలు, అందరికీ అన్ని రకాలుగా ఆసరాను అందిస్తూ అంబేడ్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో దేశంలో దళిత సకల జనుల సంక్షేమానికి తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను గుర్తు చేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
అంబేడ్కర్ జీవితమే ఆదర్శం: కష్టంతో కూడుకున్న ఎంతటి సుధీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు అంబేడ్కర్ జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు. వర్ణం, కులం పేరుతో వివక్ష, అంటరానితనాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేడ్కర్ అని వెల్లడించారు.
ప్రపంచాన్ని ఆలోచింపజేసిన అంబేడ్కర్ ప్రసంగాలు: సమాజంలో నెలకొన్న అజ్జానం, అంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మత మార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక సంస్కరణలు, చరిత్ర, ఆర్థిక వ్యవస్థతో పాటు అనేక అంశాలపై ఆయన చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయని అన్నారు. అసమానతలు లేని ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేడ్కర్ అన్నారు.