Telangana CM and Ministers Discussion On Praja Palana: నిర్దిష్ట కాల వ్యవధిలో ఐదు పథకాల అమలు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విషయంలో రాజీపడబోమని పథకాల అమలులో అధికార యంత్రాంగం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రజాపాలన తదుపరి కార్యచరణ, పథకాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఎనిమిది రోజుల పాటు ఎలాంటి సమస్య తలెత్తకుండా 1.25 కోట్ల దరఖాస్తుల స్వీకరించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అర్హులందరికీ పథకాల ఫలాలు అందే వరకూ పనిచేయాలన్నారు.
మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష - ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ
Sub Committee on Praja Palana Programme : ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపికపై సమీక్షలో చర్చించారు. ఐదు పథకాల అమలుపై మంత్రి వర్గం ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee)లో ఉంటారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల విధివిధానాలు, అర్హతల ఖరారుపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది. సిఫార్సులపై చర్చించి కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు.
నెలాఖరు వరకు డేటా ఎంట్రీ : దరఖాస్తుల్లోని సమాచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో అధికారులు కంప్యూటరీకరిస్తున్నారు. సుమారు 30వేల మంది డేటాను ఎంట్రీ చేస్తున్నారు. ఈనెలాఖరు వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుందని అధికారులకు సీఎం వివరించారు. దరఖాస్తుల్లోని ఆధార్, రేషన్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా అర్హులను ప్రాథమికంగా గుర్తించవచ్చునని తెలిపారు. దరఖాస్తుల ఇంటింటి పరిశీలన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అధికారులు ఇంటికి వెళ్లి దరఖాస్తుల్లోని సమాచారం నిజమా, కాదా నిర్ధారిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు