తూర్పు అభిముఖంగా ఏడు అంతస్థుల్లో కొత్త సచివాలయ భవనం - తూర్పు అభిముఖంగా ఏడు అంతస్థుల్లో కొత్త సచివాలయ భవనం
22:03 August 05
తూర్పు అభిముఖంగా ఏడు అంతస్థుల్లో కొత్త సచివాలయ భవనం
సుదీర్ఘంగా సాగిన భేటీలో రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయ నూతన భవన సముదాయం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజైన్లను ఆమోదించింది. తూర్పు అభిముఖంగా ఏడు అంతస్థుల్లో కొత్త సచివాలయ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పించే విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలను అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల శాఖ ముసాయిదాపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పరిశ్రమల్లో మానవ వనరుల కేటాయింపును రెండు విభాగాలుగా విభజిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటించింది.
హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతాచోట్ల ఐటీ కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ పాలసీని ఆమోదించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది.తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీకి ఆమోదం తెలిపింది. ప్రత్యేక రాయితీలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.