రాష్ట్ర మంత్రివర్గం వచ్చే మంగళవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని ప్రగతిభవన్లో 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి స్థితిని సమీక్షించటంతో పాటు చికిత్స, సదుపాయాలు, సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించటంతో పాటు మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
కృష్ణా జలాల వివాదంపై
వరంగల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణం, హైదరాబాద్లో మరో నాలుగు ఆస్పత్రుల నిర్మాణం సహా కొత్త వైద్య, నర్సింగ్ కళాశాలలకు సంబంధించి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. వానాకాలం పంటలసాగు సహా సంబంధిత అంశాలపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్తో కృష్ణా జలాల వివాదం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులతో వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
పల్లె,పట్టణ ప్రగతిపై చర్చ
పల్లెప్రగతి, పట్టణప్రగతిపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పల్లె, పట్టణప్రగతి ఈనెల 10 తేదీతో పూర్తి కానుంది. దీంతో ఇప్పటి వరకు జరిగిన పురోగతి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్లో చర్చించనున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెంచాలన్న మంత్రివర్గ ఉపసంఘ సిఫారసు నేపథ్యంలో అందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇతర పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:AP MLA ROJA: రేవంత్ రెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే రోజా ఫైర్