Telangana Cabinet Takes Major Decisions : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా.. ఐదు గంటలకు పైగా సమావేశం అయింది. భారీ ఎజెండాలో దాదాపు 50కి పైగా అంశాలపై ఆమోద ముద్ర వేసింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై విస్తృతంగా సమీక్షించింది. వరదల పరిస్థితి జరిగిన నష్టాన్ని విపత్తు నిర్వహణ, వ్యవసాయ, ఆర్అండ్‌బీ శాఖలు.. మంత్రివర్గానికి నివేదించాయి.
ఎక్కువగా నష్టం జరిగిన 10 జిల్లాలకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించింది. దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఇద్దరు విద్యుత్ శాఖ సిబ్బందికి, ఆశ్రమ పాఠశాల సిబ్బంది ఒకరికి ప్రత్యేక అభినందనలు తెలిపిన కేబినెట్.. ఆగస్టు 15న ప్రత్యేకంగా సన్మానించాలని నిర్ణయించింది.
Telangana Cabinet Meeting Decisions : ఖమ్మంలో మున్నేరు ఒడ్డున ఆర్‌సీసీ వాల్ నిర్మాణాన్ని ఆమోదించిన మంత్రివర్గం.. పొలాల్లో ఇసుక మేటలు, అన్నింటినీ పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్న మంత్రి కేటీఆర్.. కేంద్రం రాజకీయం చేయకుండా సాయం చేయాలని కోరారు.
"దాదాపు పది జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎక్కువగా నష్టం జరిగింది. అందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. వరదల్లో దాదాపు 27,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం. వరదల్లో 40 మంది చనిపోయారు. వారికి ఎక్స్‌గ్రేషియా అందజేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది." - కేటీఆర్, మంత్రి
Cabinet Decides TSRTC Merge with Government :ఆర్టీసీ విషయమై కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్... కార్మికులకు శుభవార్త అందించింది. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించి.. విధివిధానాల కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేసింది. వచ్చే సమావేశాల్లోనే సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం 250 ఎకరాల భూమి ఇచ్చేందుకు తీర్మానించింది. విస్తరణ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ ఉత్తరాన ఉన్న హకీంపేట ఎయిర్‌పోర్టును.. పుణె, గోవా తరహాలో పౌర విమానయానం కోసం కూడా ఉపయోగించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు. రూ.60,000 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ భారీ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మూడు, నాలుగేళ్లలో మెట్రో రైల్‌ను పెద్ద ఎత్తున విస్తరించాలని నిర్ణయించింది. మెట్రో విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నామన్న కేటీఆర్ .. లేదంటే తామే చేపడతామని చెప్పారు. 2024 తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు.