తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12 వేల పోస్టుల భర్తీ - Cabinet Subcommittee latest news

వైద్యఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. కోర్టు కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను ఆర్నెల్లకోసారి లేదా ఏడాదికోసారి నియమించుకోవడానికి ఆమోదించింది.

telangana  cabinet sub-committee said 12,000 posts would be filled soon in the medical health department
వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12 వేల పోస్టుల భర్తీ

By

Published : Oct 9, 2020, 7:52 AM IST

తెలంగాణలో వైద్యఆరోగ్యశాఖను బలోపేతం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. మంత్రులు కేటీఆర్‌, ఈటల, ఎర్రబెల్లి, తలసాని సమావేశంలో పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ను కట్టడి చేయడంలో ఆరోగ్యశాఖ అద్భుతంగా పనిచేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రసూతి మరణాల రేటు 92 నుంచి 63కు, శిశు మరణాల రేటు 39 నుంచి 27కు తగ్గాయని చెప్పారు. కొత్తగా నిర్ధారణ కేంద్రాలను, రక్తశుద్ధి, రక్తనిధి కేంద్రాలను నెలకొల్పడం వంటి అధునాతన సాంకేతికతతో దూసుకెళ్తోందని అభినందించారు. ఉపసంఘం సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విలేకరులకు వివరించారు. ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిస్తామన్నారు. నిర్ణయాలివీ...

ఆరోగ్యశ్రీ...

మూత్రపిండాలు, గుండె, కాలేయం తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు సుమారు రూ.30 లక్షల వరకూ ఖర్చవుతోంది. వీటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఏటా రూ.1200 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. సీఎం సహాయనిధి నుంచి వందల కోట్లు ఇస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే మెరుగైన సేవలను ఆరోగ్యశ్రీలో అందించేందుకు మరికొన్ని వైద్యచికిత్సలను కొత్తగా చేర్చనున్నారు.

బస్తీ దవాఖానాలు...

ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలుండగా.. ఈనెలలోనే మరో 26 ప్రారంభిస్తారు. మొత్తంగా 300 బస్తీ దవాఖానాలను నెలకొల్పుతారు. హైదరాబాద్‌ను 8 జోన్లుగా విభజించి, ఇప్పుడున్న దవాఖానాలను వీటికి అనుసంధానం చేస్తారు. వీటిద్వారా వైద్య నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు.

అంబులెన్సులు...

కొత్తగా ఏర్పడ్డ మండలాల ప్రకారం 108 అంబులెన్సు సౌకర్యం కల్పిస్తారు. పీహెచ్‌సీ మొదలుకొని అన్ని ఆసుపత్రుల్లోనూ అంబులెన్సు అందుబాటులో ఉంచుతారు. ఇటీవల ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ కింద 118 అంబులెన్సులు అందుబాటులోకి రాగా, ప్రభుత్వం మరో 100 కొనుగోలు చేస్తోంది. మరో 20 వాహనాలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వానికి అందాయి. వీటిని అత్యవసర సేవలకు వినియోగిస్తారు.

ఇంకా...

  • కరోనా టీకా అందుబాటులోకి రాగానే పేదలకే ముందుగా అందిస్తారు.
  • ఆరోగ్య ఉపకేంద్రాలను హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలి.
  • రోగుల సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ రికార్డుల ద్వారా భద్రపరుస్తారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే చింతమడకలో విజయవంతంగా పూర్తయింది.
  • తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించేందుకు ప్రభుత్వపరంగా ఔషధ దుకాణాలను ఏర్పాటుచేయాలి.
  • క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పాలియేటివ్‌ చికిత్స అందించేందుకు ఇప్పటికే 8 కొత్త కేంద్రాలు సేవలందిస్తుండగా, మరో రెండింటిని హైదరాబాద్‌లో నెలకొల్పుతారు.

ఇదీ చూడండి:కొవిడ్, వైద్యశాఖలోని కీలక అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ABOUT THE AUTHOR

...view details