వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. కొవిడ్ మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందంటున్న హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని.. సరిపడా మౌలిక వసతులు, సిబ్బంది, ఔషధాలను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన ఉపసంఘంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్ సభ్యులుగా ఉంటారు. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందించాలని సబ్ కమిటీని కేబినెట్ ఆదేశించింది. వైద్య, ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేయాలని శాఖను ఆదేశించింది.
సత్తుపల్లి, మధిరల్లో కొత్తగా వంద పడకల ఆసుపత్రులను నిర్మించి.. ప్రస్తుతం ఉన్న వాటిని మాతా, శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. సూర్యాపేటలో ఇపుడున్న 50 పడకల మాతా, శిశు సంరక్షణా కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగుల సహాయార్ధం వచ్చే వారి కోసం వసతి కేంద్రాలు ఏర్పాటుకు.. తక్షణం చర్యలు చేపట్టాలని వైద్యశాఖను మంత్రివర్గం ఆదేశించింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటు మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, టూడీ ఎకోతో పాటు మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలర్జీ జబ్బుల పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుత డయాలసిస్ కేంద్రాల్లో అదనపు యంత్రాలతో పాటు కొత్తగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో, రేడియో థెరపీ కోసం అవసరమైన మౌలిక వసతులతో జిల్లా క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.