తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Cabinet Meeting : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నేడే మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ - తెలంగాణ కేబినెట్‌ మీటింగ్‌ అంశాలు

CM KCR Cabinet Meeting : భారీ వర్షాలు, తదనంతర పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కోసం తీసుకోవాల్సిన చర్యలు, రహదార్ల పునరుద్ధరణ సహా కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మెట్రో రైల్ కొత్త కారిడార్లకు అనుమతి, మామునూరు విమానాశ్రయ అభివృద్ధి, అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్‌టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపు సహా శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఎన్నికల వేళ పూర్తి చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది.

CM KCR
CM KCR

By

Published : Jul 31, 2023, 8:23 AM IST

Updated : Jul 31, 2023, 9:14 AM IST

Telangana Cabinet Meeting Today : రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ భేటీలో దాదాపు 50 అంశాలపై చర్చ జరగనుంది. భారీ వర్షాలు, వరదల పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంది. అకాల వర్షాలతో వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ విధానాలపై మంత్రివర్గం చర్చించనుంది.

ఉద్ధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై చర్చించడంతో పాటు యుద్ధప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రైతులకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రహదార్లకు సంబందించి సిద్ధం చేసిన నివేదికను అధికారులు మంత్రివర్గం ముందు ఉంచుతారు. పురపాలక శాఖకు సంబంధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయి.

మెట్రో రైల్‌ విస్తరణ కేబినెట్‌ ముందుకు : రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లో ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రతిపాదనతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి. కొత్తగా ఐదు కారిడార్ల విస్తరణ... మెట్రో రెండో దశలో బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు విస్తరణకు ప్రతిపాదనలు, ఓఆర్‌ఆర్‌ వెంట మెట్రో లైన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.

Telangana Cabinet Meeting Decisions : మహబూబాబాద్ జిల్లాలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు, నిమ్స్ విస్తరణ వ్యయాన్ని రూ.1571 నుంచి రూ.1698 కోట్లకు పెంచడం, అందుకోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రుణానికి అనుమతి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ శివారులోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు.. అక్కడ టెర్మినల్ బిల్డింగ్, రన్ వే విస్తరణ కోసం భూసేకరణ అంశం కూడా మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలిసింది. కొత్త గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు ప్రతిపాదనలు, అనాథ చిన్నారుల కోసం విధానం రూపకల్పన అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. రూ.5 వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ట్రాన్స్‌కోకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చే అంశం కూడా ఉండవచ్చని తెలిసింది.

గవర్నర్‌ వెనక్కి పంపిన బిల్లులపై చర్చకు అవకాశం : గవర్నర్ వెనక్కి పంపిన నాలుగు బిల్లులపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. 2022 పురపాలక నిబంధనలు, డీఎంఈ పదవీవిరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ విషయమై చర్చించనున్నారు. తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును తొలగించడం, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లుల ముసాయిదాపై మంత్రివర్గం చర్చించనుంది. బిల్లులను ఆమోదిస్తే గురువారం ప్రారంభమయ్యే శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రవేశ పెడతారు.

Discussion On TSRTC In Cabinet Meeting : ఆర్‌టీసీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్న కేబినేట్.. ఉద్యోగుల జీతభత్యాల పెంపు, తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. బీడీ పరిశ్రమ టేకేదార్లకు ఆసరా పింఛన్లు ఇచ్చే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో పోస్టుల మంజూరు సహా ఇతరత్రాలకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. వీఆర్‌ఏల క్రమబద్దీకరణ, సర్దుబాటుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, గృహలక్ష్మి, బీసీలు, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం, దళితబంధు సహా కీలకమైన పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 31, 2023, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details