రాష్ట్రంలో చాలాకాలంగా కొనసాగుతోన్న పోడు భూముల సమస్యపై మంత్రివర్గంలో ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజనులకు సంబంధించి వారు తమ అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు ఇవ్వాలని కోరుతున్న విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో ఎక్కడైతే పోడు భూముల సమస్య ఉందో ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సంబంధిత శాఖల సమక్షంలో జిల్లాలో పోడు భూములు సాగు చేసే వారు ఎంత మంది ఉన్నారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? అనే విషయాలను సమీక్షించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కేబినెట్ ఆదేశించింది.
దళితబంధు విస్తరించాలని నిర్ణయం..దళితబంధు పథకంపై కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న వంద మందితో పాటు ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. హుజూరాబాద్‌లో మొత్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గంలోనూ లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించింది. గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.