ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. రెవెన్యూ వ్యవస్థలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయాలని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లు-2020కి... కేబినెట్ ఆమోదం తెలిపింది.
బుధవారం శాసనసభలో చర్చ..
రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలపై సుదీర్ఘ కసరత్తు చేసిన సర్కారు.... కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ఆమోదించింది. తెలంగాణ భూమి, పట్టాదారు పాసుపుస్తకాలపై హక్కుల పేరిట రూపొందించిన.. నూతన బిల్లుకు పచ్చజెండా ఊపింది. కొత్త రెవెన్యూ బిల్లును బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. టీఎస్-బీపాస్ బిల్లుకు ఆమోద ముద్రవేసింది. తెలంగాణ మున్సిపాల్టీ చట్టం -2019లోని సవరణ బిల్లుకు అంగీకారం తెలిపింది. గ్రామాల్లో వ్యవసాయేతర ఆస్తులబదిలీకి సంబంధించిన చట్టంలోని సవరణల కోసం రూపొందించిన బిల్లుకు ఆమోదముద్రవేసింది. తెలంగాణ జీఎస్టీ చట్టం 2017లో సవరణ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తూ.. జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌ను... మంత్రి మండలి ఆమోదించింది.
పదవీ విరమణ వయోపరిమితి పెంపు:
ఉద్యోగులు, ఫించనర్ల వేతనాల్లో కోతకు సంబంధించిన... తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య అత్యవసర చట్టం - 2020 ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్రవేసింది. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ నిర్వహణ బిల్లును మంత్రిమండలి ఆమోదించింది. ఆయుష్ వైద్య కళశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంచుతూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను అంగీకరించింది. తెలంగాణ కోర్టు ఫీజులు, సూట్స్ వాల్యుయేషన్ చట్టం - 1956 సవరణ బిల్లు, తెలంగాణ సివిల్ కోర్టుల చట్టం -1972 సవరణ బిల్లుల ఆమోదించింది.