తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ ప్రాజెక్టుల నిర్మాణాలపై రాష్ట్ర కేబినెట్​ తీవ్ర అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణాలను తీవ్రంగా నిరసించిన కేబినెట్... రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎంత దూరమైనా పోవాలని తీర్మానించింది. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు కార్యాచరణ ఖరారు చేసిన మంత్రివర్గం.. కృష్ణాజలాల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాల వాటాను దక్కించుకునేందుకు... ఆలంపూర్ సమీపంలో గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కొత్త ఆనకట్టతో పాటు... సుంకేశుల, సాగర్ టేల్ పాండ్ ఎత్తిపోతల పథకాలను, పులిచింతల ఎడమకాల్వ, భీమా వరద కాల్వలను నిర్మించాలని నిర్ణయించింది.

Telangana cabinet, Krishna river
ఏపీ ప్రాజెక్టుల నిర్మాణాలపై రాష్ట్ర కేబినెట్​ తీవ్ర అభ్యంతరం

By

Published : Jun 20, 2021, 3:25 AM IST

Updated : Jun 20, 2021, 6:56 AM IST

కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాల్వ నిర్మాణ పనులపై... తెలంగాణ మంత్రివర్గం సుధీర్ఘంగా చర్చించింది. అనుమతి లేని అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించిందని నీటిపారుదలశాఖ తెలిపింది. ఏపీ చేపట్టిన నిర్మాణాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కేబినెట్... కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా నిర్ధరణ కాలేదని, కేంద్ర నిష్క్రియాపరత్వం వల్ల రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడింది. కొత్త రాష్ట్రానికి సహకారం అందించాల్సిన చొరవ తీసుకోకుండా బాధ్యత వహించకుండా నదీజలాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మంత్రివర్గం ఆవేదన వ్యక్తం చేసింది. అత్యున్నత మండలి సమావేశంలో కేంద్రమంత్రి ఇచ్చిన హామీ మేరకు... సుప్రీంకోర్టులో కేసును విరమించుకొన్నట్లు పేర్కొంది. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా పోవాలని అభిప్రాయపడింది. కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకొని రైతులు, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు కేబినెట్ కార్యాచరణ నిర్ణయించింది. ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించి అక్రమ ప్రాజెక్టులను ఆపించేలా చూడాలని కోరనున్నారు. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని ఎత్తిచూపాలని.. రాబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి జాతికి వివరించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల పర్యవసానంగా.. కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరగబోయే తీవ్ర నష్టాన్ని పెద్దఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.

60 నుంచి 70 టీఎంసీల వరద నీటిని తరలించాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల... ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు... హైదరాబాద్‌కు తాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్న నేపథ్యంలో న్యాయంగా కృష్ణా నీటి వాటాను దక్కించుకునేందుకు కేబినెట్ కొన్ని నిర్ణయాలను తీసుకొంది. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానదిపై అలంపూర్ సమీపంలో గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్దమారూరు గ్రామాల పరిధిలో ఆకనట్ట నిర్మించాలని నిర్ణయించింది. జోగులాంబ ఆనకట్ట నిర్మించి 60 నుంచి 70 టీఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా... తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల జలాశయానికి నీటిని ఎత్తిపోసి.. పాలమూరుతో పాటు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని నిర్ణయించింది. పులిచింతల ఎడమ కాల్వ నిర్మించి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. సుంకేశుల జలాశయం నుంచి మరో ఎత్తిపోతల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతంలోని మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా ఉపనది అయిన భీమా రాష్ట్రంలో ప్రవేశించే కృష్ణా మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద వరద కాల్వను నిర్మించాలని నిర్ణయించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగర్ పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. కొత్త ప్రాజెక్టులకు సర్వే నిర్వహించి, డీపీఆర్ల తయారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖను మంత్రివర్గం ఆదేశించింది.

జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలి

వానాకాలం సీజన్​లో వీలైనంత సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేసి.. ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలని, తద్వారా ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్తు ఖర్చును తగ్గించుకోవచ్చని కేబినెట్ అభిప్రాయపడింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న 2 వేల 375 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా సంపూర్ణ సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దాంతో కాళేశ్వరం, దేవాదుల, ఏఎంఆర్పీ తదితర ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఇంధనశాఖను మంత్రివర్గం ఆదేశించింది..

ఇదీ చదవండి:TS UNLOCK: తెలంగాణ అన్​లాక్.. ఇవన్నీ ఓపెన్

Last Updated : Jun 20, 2021, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details