ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ వేదికగా రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమైంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు 8 అంశాలపై చర్చించారు. ఆర్థికమాంద్యం కారణంగా ఆదాయం తగ్గిందని... కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం కూడా రావడం లేదని సీఎం సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని... వారి విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని కేసీఆర్ ఆక్షేపించారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్నికి లేఖ...
రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశానన్న సీఎం కేసీఆర్... త్వరలోనే ప్రధానమంత్రిని కూడా కలిసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్రంలో కూడా ఆదాయాలు పడిపోయాయని... ఈ పరిస్థితుల్లో అన్ని శాఖలు కఠినమైన ఆర్థిక నియంత్రణ పాటించాలని స్పష్టం చేశారు. బడ్జెట్ కేటాయింపులకు మించి ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయడానికి వీల్లేదన్నారు. అదనపు ఆదాయం రాబట్టే అవకాశాలపైనా మంత్రివర్గంలో చర్చించారు. మంత్రులు, కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన నిధుల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు.
దుమ్ముగూడెం ఆనకట్ట...
320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై రూ.3వేల 482 కోట్ల అంచనా వ్యయంతో ఆనకట్ట నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా ఆనకట్ట నిర్మాణం చేపట్టవచ్చని అధికారులు తెలిపారు.