తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

రాష్ట్రంలో లాక్​డౌన్ యథాతథంగా కొనసాగించాలా.. లేక.. ఈనెల 20 నుంచి సడలింపులు ఇవ్వాలా అనే అంశంపై రేపు మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. సడలింపులపై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున.. ఇప్పుడే సడలింపులు ఇవ్వకుండా.. మే 3 వరకు లాక్​డౌన్ కొనసాగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

By

Published : Apr 18, 2020, 9:03 PM IST

telangana cabinate meet tomorrow at pragathi bhavan in hyderabad
రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి రాష్ట్రంలో లాక్​డౌన్ నిరవధికంగా కొనసాగుతోంది. మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఈనెల 20 నుంచి పలు సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నందున.. ఇప్పడున్న పరిస్థితుల్లో సడలింపులు ఇస్తే ఎలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కేంద్రం పేర్కొన్న రంగాలన్నింటికీ మినహాయింపులు ఇస్తే.. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తే.. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం మార్గదర్శకాలు, రాష్ట్రంలో పరిస్థితులపై రెండు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చిస్తున్నారు. ఇప్పుడే సడలింపులు ఇవ్వొద్దని.. మరికొన్నాళ్లు లాక్​డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎంకు వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలపై ఏ విధంగా స్పందించాలి.. సడలింపులు ఇవ్వాల్సిందేనా... మే 3 లేదా ఏప్రిల్ 30 వరకు యథాతథంగా కొనసాగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రివర్గం చర్చలు జరపనుంది.

ఆర్థిక పరిస్థితులపై సమాలోచనలు.....

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై కూడా రేపు కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. లాక్​డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా పడిపోయింది. హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ కోరినప్పటికీ.. కేంద్రం నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రేషన్, నగదు బదిలీ, వ్యవసాయ రంగం, పంటల కొనుగోళ్లు, విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ABOUT THE AUTHOR

...view details