Budget Sessions 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం సమావేశాలు పూర్తయ్యాయి. ప్రోరోగ్ కానందున గత సమావేశాలకు కొనసాగింపుగా పరిగణించి గవర్నర్ ప్రసంగానికి ఆస్కారం లేదన్న ప్రభుత్వ నిర్ణయంతో సమావేశాలు ప్రారంభానికి ముందే వేడెక్కాయి. సర్కార్ వైఖరిపై విపక్షాలు మండిపడగా గవర్నర్ తమిళిసై సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. బడ్జెట్ ప్రసంగం వేళ వెల్‌లోకి వెళ్లినందుకు మొదటిరోజే ముగ్గురు భాజపా సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభాపతి నిర్ణయంపై వారు కోర్టును ఆశ్రయించారు.
స్వయంగా కమిషనర్...
హైకోర్టు నోటీసులను శాసనసభ కార్యదర్శి స్వీకరించకపోగా సమావేశాలు ముగిసే ముందురోజు స్వయంగా పోలీస్ కమిషనర్ వచ్చి నోటీసులు అందించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చివరి రోజు సభాపతిని కలిసినా భాజపా సభ్యులకు ఉపశమనం కలగలేదు. కోర్టు సూచన, సభకు అనుమతించాలన్న తమవిజ్ఞప్తిని సభాపతి తిరస్కరించారని... భాజపా ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాలకు భాజపా సభ్యులు పూర్తిగా లేకుండా పోయారు.
సమావేశాల ప్రారంభం రోజున 2022-23 ఆర్థిక సంవత్సరానికి... 2లక్షల56వేల958 కోట్లతో ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాసనసభలో బడ్జెట్‌పై ఒకరోజు సాధారణ చర్చ... 37 పద్దులపై నాలుగురోజుల పాటు చర్చజరిగింది. సమావేశాల చివరిరోజు ద్రవ్యవినిమయ బిల్లును... ఉభయసభలు ఆమోదించాయి. ఎఫ్ఆర్బీఎం, మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లులు ఉభయసభల ఆమోదం పొందాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలారోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాలపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 80వేల39 ఖాళీలు భర్తీ చేయడంతో పాటు 11,103 మంది ఒప్పందఉద్యోగుల్నిక్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు.