Telangana Budget 2022: 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రేపు శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2023 సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే. అందుకు అనుగుణంగానే వార్షిక పద్దును సిద్ధం చేసినట్లు తెలిసింది. సర్కార్ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు ఉండనున్నాయి. యధావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకే బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. అన్నింటి కంటే దళితబంధు పథకానికి నిధులు ఎక్కువగా కేటాయించనున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వడ్డీ లేని రుణాలు, ఇళ్ల నిర్మాణం తదితరాలకు కేటాయింపులు పెరగనున్నాయి.
కేటాయింపులు...
సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థికసాయం పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు సమాచారం. సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉండనున్నాయి. రైతుబంధు, రైతుబీమాతో పాటు రుణమాఫీకి నిధులు ఉండనున్నాయి. వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల పనులకు అవసరమైన నిధులు కేటాయించనున్నారు. రహదార్లు, మౌలిక వసతుల నిర్మాణం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. మన ఊరు- మన బడి కార్యక్రమాలకు నిధులు ఇవ్వనున్నారు. పీఆర్సీసీకి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు, కొత్త నియామకాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు ఉండనున్నాయి.
బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశం...