తెలంగాణ

telangana

ETV Bharat / state

చురుగ్గా కొనసాగుతున్న బడ్జెట్ కసరత్తు... - తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర సొంత రాబడులు తగ్గడం, కేంద్ర పన్నుల వాటాలోనూ కోత పడిన నేపథ్యంలో.. బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి సగటున 15 శాతం ఉన్న పన్నుల రాబడి, వృద్ధి రేటు.. ఈసారి గణనీయంగా తగ్గింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో స్పష్టత, సొంత రాబడుల అంచనాలకు అనుగుణంగా.. పది శాతం వృద్ధి రేటుతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం కానున్నట్లు సమాచారం.

active-budget-exercise
"చురుకుగా బడ్జెట్‌ కసరత్తు"

By

Published : Feb 20, 2020, 5:08 AM IST

Updated : Feb 20, 2020, 2:20 PM IST

చురుగ్గా కొనసాగుతున్న బడ్జెట్ కసరత్తు...

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల మొదటి వారంలో ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి నాలుగో తేదీతో పట్టణప్రగతి ముగిసిన వెంటనే రెండు, మూడు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కసరత్తు ఇప్పటికే కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ రాబడులు గణనీయంగా తగ్గాయి.

జీఎస్టీ, అమ్మకం పన్ను ద్వారా అధిక ఆదాయం

కేంద్రం పన్నుల వాటాలో తగ్గుదల ఉంది. రాష్ట్రానికి జీఎస్టీ, అమ్మకం పన్ను ద్వారానే అధిక ఆదాయం సమకూరుతోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి చూస్తే... తొలిసారిగా రాబడుల్లో తక్కువ వృద్ధి రేటు నమోదైంది. 2015-16 నుంచి 2018-18 వరకు రాష్ట్ర రాబడుల సగటు వృద్ధిరేటు 16శాతం. 2017-18లో గరిష్ఠంగా 19 శాతం పన్నుల ఆదాయం పెరిగింది. 2018-19లోనూ 15 శాతం ఉన్నప్పటికీ ప్రస్తుత ఏడాదిలో మాత్రం బాగా తగ్గింది.

పెట్రోలియం ఉత్పత్తులపై పెను ప్రభావం

రాష్ట్ర వృద్ధిరేటు రెండంకెలు చేరుకునే పరిస్థితి లేదు. జీఎస్టీ రాబడుల్లో మాత్రమే స్వల్ప పెరుగుదల ఉండగా.. పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి గతంలో కంటే తగ్గింది. అయితే జీఎస్టీలో నిర్దేశించిన మేర రాబడులు లేనందున కేంద్రం నుంచి రాష్ట్రం ఈ ఏడాది 1900 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా పొందింది.

లక్షా 46 వేల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌

2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా 46 వేల కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో పదివేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. దీంతో మిగిలిన లక్షా 36 వేల కోట్ల మార్కుకు దగ్గరగా వెళ్తామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

త్వరలో సీఎం సమీక్ష

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడుల అంచనాతోపాటు కేంద్ర పనుల్లో వాటా, 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి స్పష్టత వచ్చినందున అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. స్థూలంగా పదిశాతం వృద్ధిరేటు ప్రాతిపదికన బడ్జెట్ ప్రతిపాదనలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అధికారుల స్థాయిలో బడ్జెట్ కసరత్తు పూర్తైనట్లు చెబుతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలను సమీక్షించనున్నారు.

ఇవీ చూడండి :విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి

Last Updated : Feb 20, 2020, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details