వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమమైన అభివృద్ధి సాధించామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. పంటల ఉత్పత్తిలో 23.7 శాతం, పాడిపశువుల రంగంలో 17.3 శాతం,చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధి సాధించామని వెల్లడించారు. రైతుబంధు ద్వారా సత్ఫలితాలు సాధించామని చెప్పారు. కొత్త పాసుపుస్తకాల మంజూరు వల్ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతోందన్నారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల అదనపు కేటాయించినట్లు ప్రకటించారు. రైతుబంధు కోసం బడ్జెట్‌లో రూ.14 వేల కోట్ల కేటాయింపునకు ప్రతిపాదించారు.
రైతు భీమాకు..
రైతు ఏ కారణంతో మృతిచెందినా వాళ్ల కుటుంబానికి రైతుబీమా కింద రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. 18-60 ఏళ్ల వయసు ఉన్న ప్రతిరైతుకు బీమా సదుపాయం వర్తించనుంది. రైతుబీమా కింద రైతుల ప్రీమియం రూ.2,271.50 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. రైతు మరణించిన 10 రోజుల్లోనే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు. రైతుబీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయించామని చెప్పారు.