తెలంగాణ బడ్జెట్‌కు తుదిరూపునిస్తోన్న ఆర్థిక శాఖ తెలంగాణ బడ్జెట్‌కు ఆర్థిక శాఖ కసరత్తు.. చివరి దశకు వచ్చింది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి అందే కేంద్ర నిధులపై పూర్తి స్పష్టత వచ్చింది. రాష్ట్ర సొంత పన్ను రాబడులు, ఇతర ఆదాయాలు జనవరి వరకు సమగ్ర వివరాలు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు రోజుల్లో పద్దు ప్రతిపాదనలు
బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు జి.ఆర్.రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావులు కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. మూడు, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రికి బడ్జెట్ ప్రతిపాదనలు అందించనున్నారు. సమగ్ర పరిశీలన అనంతరం సీఎం సూచనల మేరకు బడ్జెట్‌ను నిర్ణయించనున్నారు.
పథకాలకు ప్రాధాన్యత
గత ఆర్థిక సంవత్సరం కంటే రాబడులు ఎక్కువ ఉన్నా.. అంచనాల మేరకు ఉన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని తాజా బడ్జెట్ సిద్ధమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాబడులు.. అంచనాల్లో పదిశాతం మేర తగ్గాయి. ఈ సారి కూడా జీఎస్టీ రాబడులు.. అంచనాలకంటే తగ్గనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలకు మాత్రం బడ్జెట్ కేటాయింపులు ఏ మాత్రం తగ్గవని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గతేడాది కేటాయింపుల కొనసాగింపు
2019 - 20 బడ్జెట్లో కేటాయింపులను.. రానున్న ఆర్థిక సంవత్సరానికి కొనసాగించడమే కాకుండా కొంత మేర పెంచాల్సిన పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలపై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. శాఖలవారీగా వ్యయాన్ని ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,46,492 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించగా ఇందులో పథకాల వ్యయం రూ.75,263 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.71,229 కోట్లుగా ఉంది.
వచ్చే నెల మొదటివారంలో బడ్జెట్
ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన ఆసరా, పెట్టుబడి రాయితీ, రైతు రుణమాఫీ, రైతుబీమా, ఉపకార వేతనాలు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలకు ఈ సారి కూడా గతంలో కంటే తక్కువ కాకుండా కేటాయింపులు ఉండనున్నాయి. ఈ వారాంతంలోగా బడ్జెట్ ప్రక్రియ పూర్తి కానుంది. వచ్చే నెల మొదటివారంలో శాసనసభలో పద్దు ప్రవేశపెట్టనున్నారు.