తెలంగాణ

telangana

ETV Bharat / state

హామీల అమలే లక్ష్యం.. ఈ సారి బాహుబలి బడ్జెట్‌నే అంట.! - రైతుల రుణ మాఫీకే బడ్జెట్‌లో పెద్దపీట

Telangana Budget 2023 : ఎంతగానో ఎదురుచూస్తున్న రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని శాఖల సంక్షేమం కోసం భారీ బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రైతుల రుణ మాఫీ, దళితబంధు వంటి పథకాలకు అగ్రస్థానం ఇవ్వనున్నట్లు ఉన్నతవర్గాల సమాచారం.

budget
రైతు రుణాలు

By

Published : Jan 27, 2023, 6:55 AM IST

Telangana Budget 2023 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పెద్ద పీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెడుతున్న పద్దులో కీలక పథకాలకు కేటాయింపులు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడం లక్ష్యంగా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Telangana Budget 2023 update : రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. ఇందులో మొదటి ఏడాది రూ.25 వేలలోపు రుణాలను మాఫీ చేయగా తర్వాత క్రమంగా పెంచుకుంటూ రూ.37 వేల లోపు అప్పులను రద్దు చేశారు. తర్వాత రుణమాఫీ ఆగిపోయింది. 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు రుణమాఫీకి నిధులు కేటాయించారు. ఆ ఏడాది రూ.5,225 కోట్లను కేటాయించినా వ్యయం చేయలేదు. 2022-23లో నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ అమలుకు వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది.

అన్ని ప్రభుత్వ పథకాలను భారీగా పెరగనున్న నిధులు:

  • 2022-23లో దళితబంధుకు రూ.17 వేల కోట్లను కేటాయించగా ఈ సారి కూడా అంతే మొత్తంలో నిధులివ్వనున్నట్లు తెలిసింది. రైతుబంధుకు రూ.15 వేలకోట్ల మేర కేటాయింపులు ఉండనున్నాయి. రైతుబీమాకు కేటాయింపులను వాస్తవిక ప్రాతిపదికగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. రెండు పడకల గదుల ఇళ్లకు 2022-23లో రూ.12 వేలకోట్లు కేటాయించగా ఈ సారీ యథాతథంగా నిధులివ్వనున్నట్లు సమాచారం. కేసీఆర్‌ కిట్‌కు రూ.500 కోట్లకు పైగా కేటాయించనున్నారు.
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కోసం తొలిసారిగా బడ్జెట్‌ కేటాయింపులు 3 వేల కోట్ల మేరకు చేరనున్నట్లు తెలిసింది. ఈఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లుండగా వచ్చే ఏడాది నిధులు పెరగనున్నాయి.
  • 57 ఏళ్లకే ఆసరా పింఛను అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కేటాయింపులు రూ.12 వేలకోట్లు దాటనున్నాయి. వ్యక్తిగత లబ్ధిని చేకూర్చే పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బడ్జెట్‌లో నిధులు తగ్గకూడదనే ప్రాథమిక సూత్రం ప్రాతిపదికగా బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిరూపు ఇస్తున్నారు.

నియోజకవర్గానికి వేయి మంది... రూ.1000 కోట్లు: సొంత జాగా గల వారికి ఇంటి నిర్మాణానికి రూ.మూడు లక్షల సాయం పథకానికి బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి వేయి మందికి చొప్పున సాయం అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు సైతం సిద్ధమయ్యాయి. కొత్త బడ్జెట్‌లో కేటాయింపుల ఆధారంగా పథకాన్ని ప్రారంభించే వీలుంది. ఈ పథకం కోసం నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన ఉన్న కమిటీ వారిని ఎంపిక చేస్తుందని తెలిసింది.

  • వివిధ వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీటవేయనున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు రూ.35 వేలకోట్లకు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దళితబంధు నేపథ్యంలో ఎస్సీ సంక్షేమానికి 2022-23 బడ్జెట్‌లో రూ.20,624 కోట్లు కేటాయించగా ఈ సారి నిధులు పెరగనున్నాయి. రెండు మూడ్రోజుల్లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చేలా ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. వేతన సవరణ ఒప్పందం అమలుతో పాటు కొత్త ఉద్యోగ నియామకాల నేపథ్యంలో వేతనాలు, పింఛన్లకు కేటాయింపులు భారీగా ఉంటాయని తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని ప్రకటనలను రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలకు ముందే పూర్తి చేసేలా దృష్టిసారించినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details