Telangana Budget 2023-24: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా రాష్ట్ర సర్కారు మరోమారు భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.రూ. 2,90,396 కోట్లతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుందన్న మంత్రి.. ప్రజాసంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకోవటం రాష్ట్ర ప్రజలందరికి గర్వకారణమని అన్నారు.
ఎన్నికల ప్రయోజనాలు కాకుండా.. ప్రజల అవసరాలే ప్రమాణికంగా భావించే బీఆర్ఎస్ సర్కారు.. ఆశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు మహా సంకల్పంతో ముందుడుగు వేస్తుందని అన్నారు. అనేక సవాళ్లు, అవరోదాలు ఎదురైనా.. కేంద్రం వివక్ష చూపుతున్నా తెలంగాణ ఆప్రతిహతంగా కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం ఆగదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
సాధించిన దానికి సంతృప్తి చెంది అక్కడే ఆగిపోకుండా సరికొత్త లక్ష్యాలతో ముందడుగు వేస్తామని భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ రాబడి రూ.2,16,566 కోట్లు, మూలధన రాబడి రూ.55,278 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ.1,31,028 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ.41,259 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. రుణాల ద్వారా రూ.46, 317 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు.
మొత్తం ఆదాయంలో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా ఉంటుందన్న సర్కారు.. మూలధన వ్యయం రూ.37,525 కోట్లని పేర్కొంది. రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ.28,479 కోట్లు, మూలధన పంపిణీ రూ.12,606 కోట్లని ప్రతిపాదించారు. ఖర్చులు పోనూ రెవెన్యూ మిగులు రూ.4,881 కోట్లుగా ఉంటుందని ప్రతిపాదించిన సర్కారు.. ద్రవ్య లోటు రూ.38,234 కోట్లుగా అంచనా వేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో రూ.3,17,115 ఉండవచ్చన్న సర్కారు.. ఇది జాతీయ సగటు అయిన రూ.1,70,620 కంటే 86 శాతం ఎక్కువని స్పష్టం చేసింది.