రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా, ప్రజలే కేంద్రంగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. చిట్టాపద్దు అంటే కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని... సామాజిక విలువల స్వరూపమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న హరీశ్‌రావు.. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా రూ.1,82,914 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేసీఆర్‌కున్న సమగ్రదృష్టిని, శ్రద్ధాశక్తుల్ని ఈ పద్దు ప్రతిబింబిస్తుందని మంత్రి హరీశ్ తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతికి ఎంతటి నిబద్ధతతో పాటుపడుతున్నామో చాటిచెబుతుందని పేర్కొన్నారు.
రాబడి రూ.1,43,151 కోట్లు..
2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయంలో రెవెన్యూ రాబడి రూ.1,43,151 కోట్లు ఉంటుందని అంచనా వేసిన సర్కారు.. రుణాలు సహా మూలధన రాబడులు రూ.39,550 కోట్లుగా వస్తాయని లెక్కకట్టింది. రెవెన్యూ రాబడిలో పన్నుల వాటా ద్వారా రూ.85,300కోట్లు, పన్నేతర రాబడి రూ.30,600కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.16,726కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ.10,525 కోట్లుగా అంచనా వేసింది. అప్పుల ద్వారా రూ. 35,500కోట్లు సమీకరించుకోవాలని ప్రతిపాదించింది.
వ్యయం రూ.1,38,669 కోట్లు..
ఈ ఆదాయంలో రెవెన్యూ వ్యయం రూ.1,38,669 కోట్లుగా లెక్కగట్టిన సర్కారు.. మూలధన వ్యయం రూ.22,061 కోట్లుగా అంచనా వేసింది. ఈ ఏడాది వడ్డీ చెల్లింపులకు రూ.14,615కోట్లు కేటాయించింది. పాత రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ.15,662 కోట్లు ప్రతిపాదించింది. అన్ని ఖర్చులు పోనూ.. బడ్జెట్ అంచనాల్లో రూ.4,482 కోట్ల మిగులు తేలుతుందని లెక్కకట్టారు. ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్ల ఉంటుందని అంచనా వేశారు.
కేటాయింపులు ఇలా..
వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తామని శాసనసభ వేదికగా ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా సాగు రంగానికి కొత్త జవసత్వాలు కల్పించాలనే లక్ష్యంతో రైతుబంధుకు రూ.14 వేల కోట్లుతో అగ్రతాంబూలం అందించింది. రైతుబీమా కోసం రూ.1,141 కోట్లు, రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ.1,000 కోట్లు, సూక్ష్మ సేద్యం కోసం రూ.600 కోట్లు కేటాయించింది. రైతు వేదికల నిర్మాణానికి తొలిసారిగా రూ.350 కోట్లు ప్రతిపాదించింది. పాడి రైతుల ప్రోత్సాహకానికి రూ.100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లును పద్దులో పెట్టింది.
సాగునీటి నుంచి సంక్షేమం వరకు..
ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా సాగు నీటి రంగానికి కేటాయింపులు చేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో రూ.11,054 కోట్లు ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు, ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.16,534.97 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.9,771.27 కోట్లు, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1,518.06 కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రూ.4,356.82 కోట్లు కేటాయింపులు చేసింది