Bandi Sanjay visits Karimnagar : రాష్ట్ర బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని.. అదంతా కేవలం మీడియా సృష్టేనని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కలపడానికి ఒక వర్గం మీడియా కుట్ర పన్నుతోందన్నారు. కరీంనగర్‌లోని పలు వార్డుల్లో ఎంపీలాడ్స్‌తో చేపట్టనున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు.
ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ ఉందన్న ఆయన.. పార్టీ పెద్దల సూచనల ప్రకారం ఎవరి బాధ్యతను వారు నిర్వర్తిస్తామన్నారు. కర్ణాటకలో తమ ఓటింగ్ శాతంలో ఎలాంటి మార్పు లేదని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఉనికిని చాటుకోవడానికి 150కోట్ల రూపాయలతో సంబరాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే.. కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా రామడుగులో పర్యటించిన కేసీఆర్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల పరిహారం ఇస్తానని చెప్పి ఇంతవరకు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమకాలేదని దుయ్యబట్టారు.