రాష్ట్రంలో కమల దళపతి ఎంపికపై పార్టీ శ్రేణుల నుంచి భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కృష్ణదాస్ ఇప్పటికే అభిప్రాయాలు స్వీకరించారు. ఎక్కువ మంది రాష్ట్ర నేతలు ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రెండో దఫా అభిప్రాయ సేకరణలో మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.
దిల్లీ స్థాయిలో మంతనాలు....
మరోవైపు అధ్యక్ష పదవి కోసం దిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మణ్‌తో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరు ఒక దశలో గట్టిగా వినిపించినా... తొలిసారి ఎంపీగా గెలిచినందున పార్టీ రాష్ట్ర బాధ్యతల్ని చేపడితే.. నియోజకవర్గంలో పట్టు తగ్గిపోతుందని వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఆశావాదుల వినతులు...
పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నేతలు సైతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తమకూ అవకాశం ఇవ్వాలని రఘునందన్‌రావు, కృష్ణసాగర్‌రావు పార్టీ ఇన్‌ఛార్జి కృష్ణదాస్‌ను కలిసి కోరారు.