Telangana BJP MLA Candidates Second List 2023 :బీజేపీ తమ మొదటి జాబితాలో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకుగాను.. 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
BJP MLA Candidates Second List 2023 :పార్టీలోని కీలక నేతలందర్నీ పోటీలో ఉంచే ఆలోచన నేపథ్యంలో.. అత్యధిక స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల్లో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతుండటంతో.. ఆ స్థానాలపై మళ్లీ కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎంపీల్లో కొందరు ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పార్టీ ముఖ్య నేతలైన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీ.కే.అరుణ, వివేక్ వేంకటస్వామి, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పోటీ చేసే అంశంపై స్పష్టత రాలేదు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మినహా మిగిలిన నేతలంతా ఎంపీ బరిలో ఉంటాం తప్ప.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చెన్నూరు, గద్వాల, తాండూరు, మహబూబ్‌నగర్, మునుగోడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
BJP MLA Tickets in Telangana Assembly Elections 2023 : జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కీలక స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట స్థానాలు కీలకం కాగా.. ఆయా చోట్ల బరిలో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. వేములవాడ నియోజకవర్గ టికెట్ కోసం జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, ఇటీవల పార్టీలో చేరిన సీహెచ్.వికాస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తారోనని పార్టీలో చర్చనీయాంశంగా మారింది.