Telangana BJP MLA Candidates First List Delay : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే బీఆర్ఎస్ తమ జాబితా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఇవాళ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. అంతే కాదు.. ఏకంగా సభలు, సమావేశాలతో ఎన్నికల కదనరంగలోకి దూకాయి. వివిధ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఇప్పటికే టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారం పర్వానికి తెరలేపారు. పలు చోట్ల టికెట్ రాని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో వివిధ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు.
కానీ బీజేపీ (Telangana BJP)మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలో ఊగిసలాడుతుందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా కమలం పార్టీ తొలి అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమలం నేతలు తొలి జాబితా ఇవాళ లేదా రేపు ప్రకటించాలని భావించారు.
BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు
Delay in Telangana BJP MLA Candidates List 2023 : అయితే జాబితా విడుదలకు మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకా తెలంగాణకు చెందిన అభ్యర్ధులపై ఎలాంటి చర్చ చేయలేదని సమాచారం. రేపో, మాపో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై దీనిపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు అనంతరం బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాను (BJP MLA Candidates)ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కమలం పార్టీ టికెట్ ఆశిస్తున్న వారంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.