Telangana BJP Leaders Meeting Concluded At Delhi: దిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో తెలంగాణ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. కేంద్రం దాదాపు గంటన్నర పాటు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాల గురించి ఆరా తీసిన అధినాయకత్వం... బీజేపీ బలోపేతానికి చేపట్టే కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
మార్చి 3న రాష్ట్రానికి అమిత్ షా :మద్యం కుంభకోణం, కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు షా, నడ్డా సూచించారు. ముఖ్య నేతలు ప్రజల్లోకి వెళ్లాలని.. అనవసర అంశాల జోలికి వెళ్లకూడదని అధిష్ఠానం పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు బండి సంజయ్‌కి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. మార్చి 3వ తేదీన తెలంగాణకు అమిత్ షా రానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో అధికారిక కార్యక్రమంలో పాల్గొని బీదర్‌లో జరిగే పార్టీ కార్యక్రమంలో షా పాల్గొననున్నారు.
మార్చి 22న ప్రధాని మోదీ :అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు. అదే విధంగా మార్చి 22న తెలంగాణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని నేతలను అధిష్ఠానం ఆదేశించింది. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పాత, కొత్త కలయికతో సమిష్టిగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించింది. భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే: బీఆర్ఎస్ - కాంగ్రెస్ పథకం ప్రకారం తమ పార్టీకి అభ్యర్థులు లేరనే ప్రచారం చేస్తున్నాయని... రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని... త్వరలోనే రాష్ట్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ప్రధానిని ఆహ్వానించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలే ప్రజల ఆలోచనకు నిదర్శనమన్నారు.