తెలంగాణలో 2023లో జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తోన్న కాషాయదళం.. 2021 ఫిబ్రవరిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి 2023 ఎన్నికల్లో అధికార తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో జీహెచ్ఎంసీ, రెండు పట్టభద్రుల స్థానాలు, దుబ్బాక ఉప ఎన్నికలపైన ప్రధానంగా చర్చించారు.
గత ఎన్నికల్లో భాజపా కేవలం నాలుగు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయాల్లో ఇతర పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో భాజపాలో చేరడం వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. మరో వైపు కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి కోసం నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.
రాష్ట్రంలో భాజపా బలోపేతమైందని చెప్పడానికి లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని.. అదే విశ్వాసంతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. మార్చిలో జరిగే రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రెండింటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ భాజపా సిట్టింగ్ స్థానం కాగా వరంగల్, నల్గొండ, ఖమ్మం సీటును కైవసం చేసుకునేలా ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న రాంచందర్ రావు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.