Telangana BJP Election Campaign planning 2023: తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ఎన్నికల రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీటుగా సభలు, సమావేశాలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఇప్పటికే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని ఎన్నికల వేడిని రాజేసివెళ్లారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడుజేపీ నడ్డా హైదరాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాత్రి 11:30కి హైదరాబాద్ చేరుకున్న నడ్డా.. శంషాబాద్‌లోని నొవాటెల్ హోటల్లో బస చేశారు. ఉదయం పది గంటలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఔషాపూర్‌లోని వీబీఐటీలో జరిగే పార్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరై ఎన్నికల సమాయత్తంపై.. శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.
BJP Telangana Election Committees 2023: నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల సమావేశంలో.. ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికల రూట్ మ్యాప్ ఖరారుపై నేతలకు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారు. 20 అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మండల, బూత్, శక్తి కేంద్రాల ఇంఛార్జిలతో సమావేశాలు నిర్వహణ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై సమావేశాలు.. విశ్వ కర్మ యోజన పథకం, మేధావులు, పరివారక్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
కేంద్రం గ్యాస్ ధర తగ్గించడంపై మహిళల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మార్గ నిర్దేశనం చేశారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అభినందన, రాజకీయ తీర్మానాలను సిద్ధం చేశారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు, మహిళా బిల్లులను కేంద్రం తీసుకువచ్చినందుకు ప్రధానికి అభినందనల తీర్మానాలు, రాజకీయ తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసే నాటికి 43బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభలకు బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.