Telangana BJP Chief Kishan Reddy Press Meet at Hyderabad : దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. హస్తం పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అంటూ, ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక విధానం ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రామ మందిరం ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం వల్ల హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా అవలంభిస్తోందో అర్థమవుతుందని అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.
దేశంలో రోజురోజుకూ ఆధ్యాత్మికత పెరుగుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య(Ayodhya)కు రావడం లేదని చెప్పడం రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏనాడూ జాతీయ దృక్పథంతో వ్యవహరించలేదని విమర్శలు చేశారు. రామ మందిరం(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే కాంగ్రెస్కు కంటగింపుగా ఉందని ఆరోపించారు. సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతోందన్నారు.
ఎన్నికల అస్త్రంగా 'రామ మందిరం'- బీజేపీ 15రోజుల ప్లాన్ రెడీ- RSSతో కలిసి కార్యక్రమాలు!
Ayodhya Ram Mandir : రాముని ఉనికినే కొట్టేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఈ పార్టీకి బహిష్కరించడం అలవాటైపోయిందని బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జీ20(G 20), పార్లమెంటు, అఖిల పక్షం, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తోందని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలంటే ఆ పార్టీకి గౌరవం లేదని ధ్వజమెత్తారు. జీఎస్టీ ఏర్పాటు చేస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్నని విమర్శించిందన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) విదేశాల్లో భారతదేశ సౌభ్రాతృత్వాన్ని దెబ్బ తీస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.