Telangana BJP 2023 Elections Plan : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించింది. అమీర్ పేటలోని ఆదిత్య హోటల్‌లో కిషన్ రెడ్డి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ప్రకాశ్ జావడేకర్, రాష్ట్ర ఇంఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలని అందుకు సంబంధించిన కార్యాచరణపైన ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముంగిట పార్టీని ఎవరైనా నేతలు వీడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది కావున అప్రత్తమంగా ఉండటంతో పాటు అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని జన, ధన బలం ఉన్న నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్(BJP Operation Akarsh in Telangana)కు పదును పెట్టాలని జాతీయ నేతలు దిశానిర్దేశం చేశారు. చేరికలకు సంబంధించిన వ్యవహారంలో అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని చెప్పినట్లు సమాచారం.
BJP High Command Serious on TS Leaders : రాష్ట్ర బీజేపీలో కల్లోలం.. ఆ నేతలపై హైకమాండ్ సీరియస్
BJP Telangana Election Plan 2023 :సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఎన్నికలకు సమాయత్తంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పాత, కొత్త కలయికతో నేతలు సమన్వయంతో పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహదం చేయాలని ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ విస్మరించిన ఎన్నికల హామీలతో పాటు వివిధ వర్గాలను మోసం చేసిన తీరుపై క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.