KCR will inaugurate BRS office in Delhi on Thursday: తెలంగాణలో విజయవంతంగా చక్రం తిప్పిన బీఆర్ఎస్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశ రాజధాని దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి గురువారం ఉదయం దిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్(బీఆర్ఎస్ కార్యాలయం)ను ప్రారంభిస్తారు. తొలుత కార్యాలయంలో యాగం నిర్వహిస్తారు. అనంతరం ఒంటి గంటా 5 నిమిషాలకు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఒకటిన్నర వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయంలో గడుపుతారు. ఈ కార్యక్రమం కోసం కేసీఆర్ గురువారం ఉదయం దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి రహదారులు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పర్యవేక్షించారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు దిల్లీకి వెళ్లనున్నారు.
పార్టీ భవన విశేషాలు.. దిల్లీ వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 2020 అక్టోబరు 9న కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ 1315 గజాల స్థలం కేటాయించింది. ఆ స్థలానికి బీఆర్ఎస్.. మార్కెట్ విలువ ప్రకారం 8కోట్ల 41లక్షల 37వేల 500, వార్షిక స్థల అద్దె కింద 21లక్షల3వేల 438 రూపాయాలు చెల్లించింది. అనంతరం ఆ స్థలంలో ఉన్న చిన్నపాటి కొండను తొలగించి కార్యాలయ నిర్మాణానికి అనువుగా మార్చింది.