తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు షురూ.. ఘనంగా నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు - Bathukamma Celebrations in Telangana 2022

Bathukamma Celebrations in Telangana 2022: రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ... సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈసారి బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

నేటి నుంచి బతుకమ్మ వేడుకలు షురూ.. ఘనంగా నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు
నేటి నుంచి బతుకమ్మ వేడుకలు షురూ.. ఘనంగా నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు

By

Published : Sep 25, 2022, 7:28 AM IST

Bathukamma Celebrations in Telangana 2022: రంగురంగుల పూలు.. చుట్టూ చేరి మహిళలు కొట్టే చప్పట్లు.. ఎంగిలిపూలతో మెుదలు తొమ్మిది రోజులు.. తీరొక్క రుచులతో నైవేద్యాలు.. ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము ఆయే చందమామ అంటూ ఆడపడుచులు పాడే పాటలు.. అన్నీ కలగలిపి తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పండుగ బతుకమ్మ రానే వచ్చింది. రాష్ట్రం రంగుపూలతో కొత్త అందాలను సంతరించుకోనుంది. పెత్రమాస నుంచి తొమ్మిది రోజుల పాటు సాగనున్న వేడుకల్లో.. అతివలు పూలను అందంగా పేర్చి.. పైన గౌరమ్మను ఉంచుతారు. పేర్చిన బతుకమ్మ చుట్టూ అంతా చేరి ఆడి పాడి.. ఆఖరుగా బతుకమ్మను గంగ ఒడికి చేర్చడమే ఈ వేడుకల ప్రత్యేకత. ఆడపడుచులు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లినా.. ఈ వేడుకల వేళ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఆహ్లాదంగా గడుపుతారు.

9 రోజులు.. 9 రకాలు..: బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్యతో ప్రారంభమవుతుంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి పూలతో బతుకమ్మను పేర్చి.. మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడతారు. ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నన్ను బియ్యం బతుకమ్మ.. ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆఖరుగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా వేడుకలు నిర్వహిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు ఐదు రకాల సద్దులను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

ఈసారి అంబరాన్నంటేలా సంబురాలు..: ఈసారి బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటేలా జరపాలని సర్కారు నిర్ణయించింది. పల్లెలతో పాటు.. భాగ్యనగరంలోనూ బతుకమ్మ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ఎల్​బీ స్టేడియం నుంచి మొదలుకొని.. వేల మంది మహిళలు, వెయ్యి మందికి పైగా జానపద కళాకారులతో ట్యాంక్​బంద్​ వద్ద నిమజ్జనం చేయనున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో.. దేవీ వైభవ నృత్యాలు జరపనున్నారు. అక్టోబర్ 2న అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ వేడుకలు సహా.. ప్రధాన కూడళ్లు, ఎంపిక చేసిన ప్రదేశాల్లో బతుకమ్మ ప్రతిమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details