India Innovation Index 2021: ప్రభుత్వ మేధోసంస్థ నీతి ఆయోగ్ గురువారం విడుదల చేసిన మూడో ఎడిషన్ ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కర్ణాటక తొలిస్థానాన్ని పదిలం చేసుకోగా.. హరియాణా మూడో ర్యాంకులో ఉంది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక తొలిస్థానంలో నిలవగా.. ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్; కేంద్రపాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్స్ కేటగిరీలో చండీగఢ్ అగ్రస్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్ సభ్యులు వి.కె.సారస్వత్, సీఈఓ పరమేశ్వరన్, సీనియర్ సలహాదారు నీరజ్ సిన్హా ఆధ్వర్యంలో సంస్థ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ ఈ ఇండెక్స్‌ను విడుదల చేశారు.
telangana bags 2nd place in India Innovation Index:దేశంలో నవ కల్పనలు, నూతన ఆవిష్కరణలో వివిధ రాష్ట్రాల పనితీరును తెలియజేసేదే ‘ఇన్నోవేషన్ ఇండెక్స్’. దీన్ని ఏటా నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ కలిసి సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ఈ సూచీని బట్టి ఆయా ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణలకు ఉన్న అనుకూలతలు, సవాళ్లను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా జాతీయ స్థాయిలో సమగ్ర విధాన రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది.
ఎఫ్‌డీఐలను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ కర్ణాటక తొలిస్థానంలో నిలిచింది. దేశంలోకి ఎఫ్‌డీఐ మార్గాన వస్తున్న పెట్టుబడుల్లో 38 శాతం ఈ రాష్ట్రానికే వెళుతున్నాయి. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26%), దిల్లీ (14%) ఉన్నాయి. దేశంలో పట్టణీకరణ చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు సూచీ తెలిపింది. అయితే, దిల్లీ (2.5 కోట్లు), ముంబయి (2.1 కోట్లు), కోల్‌కతా (1.5 కోట్లు) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. దేశ జీడీపీలో నగర జనాభా వాటా 63 శాతం.
కేటీఆర్, హరీశ్‌రావు హర్షం:నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ నివేదికపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ 'త్రీఐ' మంత్రను ఆచరిస్తోందని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ ఫలితాలు సంతోషకరమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నీతిఆయోగ్ నివేదిక సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో ఐసీటీ ల్యాబ్‌ల సంఖ్య రెట్టింపైందని వెల్లడించారు. ఉన్నతవిద్యలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంకురాల సంఖ్య పెరగడాన్ని కేంద్రం గుర్తించిందని హరీశ్‌రావు వెల్లడించారు.