Telangana Ayush: తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారతీయ వైద్య విధానాలపై పల్లె ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం కోసం ‘ఆయుష్ గ్రామ’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభిస్తోంది. 50 మందితో కూడిన ఒక్కో ఆయుష్ వైద్య బృందం గ్రామంలోని ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. పల్లెలోని ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందుకోసం తొలివిడతగా ప్రభుత్వం 10 గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఏడాది పొడవునా 10 సార్లు వైద్యబృందాలు పర్యటించి సర్వే నిర్వహిస్తాయి. పర్యటనకు వెళ్లిన ప్రతిసారి 3 రోజుల పాటు అక్కడే ఉంటారు.
అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో...
అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఆయుష్ గ్రామ’ను విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయుర్వేద, హోమియో, యోగా, యునానీ, ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. దీంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పలు వ్యాధులను దూరం చేయొచ్చని ఆయుష్ ప్రచారం చేయనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు సహా ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తారు.
సమాచారం ఆన్‌లైన్‌లో..
*ఒక్కో బృందంలో 35 మంది ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఆయుష్ వైద్యులు, ఏడుగురు పీజీలు, 8 మంది ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యులు ఉంటారు.
*ఇంటింటికి పర్యటిస్తూ ప్రజల ఎత్తు, బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, కంటి చూపు, గుండె కొట్టుకునే తీరుపై పరీక్షలు నిర్వహిస్తారు. సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
*పసుపు, లవంగాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లి, ఇంగువ, ఆవాలు, మెంతులు, ధనియాలు తదితర వంటింటి దినుసులను ఉపయోగించి ఆరోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో అవగాహన కల్పిస్తారు.