Telangana Assembly: బడ్జెట్ పద్దులపై నేటితో చర్చ పూర్తి కానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై ఇప్పటికి మూడు రోజుల పాటు చర్చ జరిగింది. ఇప్పటి వరకు 27 పద్దులను శాసనసభ ఆమోదించింది. పద్దులపై చర్చకు చివరిరోజైన ఇవాళ... మరో పది పద్దులపై చర్చ జరగనుంది. నీటిపారుదల, గవర్నర్, మంత్రిమండలి, సాధారణ పరిపాలనా శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, లెజిస్లేచర్, ఇంధన, న్యాయ, ఆర్థిక, ప్రణాళిక శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చిస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 23,734 కోట్ల అంచనాతో అనుబంధ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అనుబంధ అంచనా వ్యయంపై కూడా సభలో చర్చిస్తారు. రెండు బిల్లులపై కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది.
పలు అంశాలపై చర్చ
కేంద్ర నిబంధనలకు లోబడి రుణపరిమితి జీఎస్డీపీలో ఐదు శాతం వరకు ఉండేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్యను 14 నుంచి 18కి పెంచడంతో పదవీకాలాన్ని రెండు నించి మూడేళ్ళకు పెంచుతూ తీసుకొచ్చిన చట్టసవరణ బిల్లుపైనా సభలో చర్చిస్తారు. ఆయిల్ పామ్ సాగు, ప్రభుత్వ వైద్యకళాశాలలు, పోలీసు శాఖ ఆధునీకరణ, విద్యుత్ రంగం, బస్తీ దవాఖానాలు, వ్యవసాయ పంపుసెట్లకు ప్రీపెయిడ్ మీటర్లు, వివిధ సంస్థల నుంచి రుణాలు, తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.