TS Assembly Sessions 2023 Started :తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. సభ పని దినాలపై ప్రత్యేకంగా సమావేశమైన బీఏసీ ఈ మేరకు నిర్ణయించింది. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై సభలో చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో దాదాపు 10 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అంతకుముందు సభా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న సంతాప తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టగా.. సభ ఆయనకు నివాళులర్పించింది. ఈ సందర్భంగా సాయన్న సేవలను స్మరించుకున్న కేసీఆర్.. ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సాయన్న లేని లోటు పూడ్చలేనిదని.. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన పరితపించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
శాసనసభ వాయిదా అనంతరం అసెంబ్లీ లాబీలో మంత్రి హరీశ్‌రావు చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతల మానసిక స్థితి దెబ్బతిన్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, రుణమాఫీ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నాయో తెలియట్లేదన్న ఆయన.. దెబ్బల మీద దెబ్బ కొట్టడం వల్ల విపక్షాలు తట్టుకోవడం లేదన్నారు. కీలక నిర్ణయాలతో ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియట్లేదని.. వరుస నిర్ణయాలతో విపక్షాలకు వాయిస్ లేకుండాపోయిందని విమర్శించారు. బయటే కాదు.. అసెంబ్లీ లోపలా విపక్షాలను కడిగేస్తామన్నారు.
'ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతల మానసిక స్థితి దెబ్బతిన్నది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రుణమాఫీ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నాయో తెలియట్లేదు. దెబ్బల మీద దెబ్బ కొట్టడం వల్ల విపక్షాలు తట్టుకోవడం లేదు. వరుస నిర్ణయాలతో విపక్షాలకు వాయిస్ లేకుండాపోయింది. బయటే కాదు.. అసెంబ్లీ లోపల కూడా విపక్షాలను కడిగేస్తాం.' - హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి
నల్గొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయని.. అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయని మరో మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులనే మార్చామనే ప్రచారం ఉన్నప్పుడు.. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం పెద్ద కష్టం కాదన్నారు. అభ్యర్థులు గెలవలేని పార్టీల్లోనే రాజకీయ గొడవలు ఉన్నపుడు.. అధికార పార్టీలో అభ్యర్థుల గొడవలు ఉండవా అని ప్రశ్నించారు. అంతర్గత కలహాలు సహజమని.. కొత్త పాత కలుపుకొని వెళ్లాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.