Telangana Assembly MonSoon Sessions 2023 : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సొంత రాష్ట్రంలో సాధించిన ప్రగతిపై ఇవాళ శాసనసభ, మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎన్నికల ముందు దాదాపుగా చివరి భేటీ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి పరిణామాలు మారనున్నాయి.
గురువారం ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో చివరి రోజైన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సొంత రాష్ట్రంలో సాధించిన ప్రగతి అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా శనివారం సభలో 5 బిల్లులకు ఆమోదం తెలిపారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కర్మాగారాలు, మైనారిటీ కమిషన్, జీఎస్టీ, పంచాయతీరాజ్ బిల్లులను ఆమోదించారు.
ఏడాది చివర్లో ఎన్నికలు..: ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు ఈ సమావేశాలను చివరి సమావేశాలుగా పరిగణిస్తున్నారు.అందులో భాగంగానే ఇవాళ స్వల్పకాలిక చర్చ అంశాన్ని ఖరారు చేసి అజెండాలో పొందుపరిచారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్.. తమ హయాంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర పురోగతిని శాసనసభ వేదికగా ప్రజలందరికీ వివరించేలా వ్యూహం సిద్ధం చేసింది. స్వల్ప కాలిక చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. సీఎం ప్రసంగం సుదీర్ఘంగా సాగనుంది. 2014 జూన్ రెండో తేదీ నుంచి తెలంగాణ ప్రగతి ప్రస్థానం, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.