Telangana Assembly Sessions 2023 Live News Today :రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవే'ఢీ'గా కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం, దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
Revanth Reddy vs Akbaruddin Owaisi in Assembly : దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ ఉంటే వినేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా అని ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే చదువుతున్న అక్బరుద్దీన్‌కు ఆ సర్కార్ లోపాలు కనిపించలేదా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఆ పార్టీ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోందని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు - జగదీశ్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేటది మొదటి స్థానమని, గజ్వేల్‌ది రెండో స్థానం, హైదరాబాద్ సౌత్‌ది మూడో స్థానమని సీఎం తెలిపారు. సిద్దిపేటలో 61.37 శాతం, గజ్వేల్‌లో 50.29 శాతం, హైదరాబాద్ సౌత్‌లో 43 శాతం విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత కేసీఆర్, హరీశ్ రావు, అక్బరుద్దీన్‌కు ఉందని, ఆ బకాయిలు చెల్లిస్తే సంస్థ నష్టాల నుంచి బయటపడుతుందని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లలో తెలంగాణను పాలించారన్న ముఖ్యమంత్రి, బీఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదని, ఇద్దరూ కలిసే పాలించారని గుర్తు చేశారు.