మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో (CM KCR IN ASSEMBLY SESSIONS) మండిపడ్డారు. 'మీ జేబులో నుంచి ఇస్తున్నరా' అని కొందరు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రెండోసారి మమ్మల్ని గెలిపించారని వెల్లడించారు. అన్ని జిల్లా పరిషత్తుల్లోనూ మమ్మల్నే గెలిపించారని గుర్తు చేశారు. ఎస్సీలు, బీసీలు చాలా వెనుకబడి ఉన్నారని సభలో పేర్కొన్న ముఖ్యమంత్రి... ఓసీల్లోనూ కొందరు పేదలు ఉన్నారని స్పష్టం చేశారు. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. సంక్షేమంతో పాటు మూలధన పెట్టుబడులూ పెంచుతున్నామని వివరించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని అభిప్రాయపడ్డారు.
ఎప్పుడైనా పట్టించుకున్నారా?
అన్ని మతాలను గౌరవించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని తెలిపారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బోనాల పండుగను గతంలో ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. బోనాల పండుగకు రూ.15 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. యాదాద్రి ఖ్యాతి విశ్వవిఖ్యాతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో నవంబర్, డిసెంబర్లో యాదాద్రి సుందర దర్శనం ఉంటుందని ప్రకటించారు.
తెలంగాణనే నిధులు ఇస్తోంది
'మీకు వ్యవసాయం రాదు.. తెలివిలేదన్న' ఏపీ నుంచి మనం విడిపోయామని గుర్తు చేశారు. ఏపీ తలసరి ఆదాయం రూ.1.7 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.37లక్షలుగా ఉందన్నారు. కేంద్రం తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది రెట్టింపు ఉందని తెలిపారు. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తారు? అని మండిపడ్డారు. రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుందని వివరించారు. తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది.. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదని మరోసారి ఉద్ఘాటించారు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చేవి కేవలం నాలుగైదు రాష్ట్రాలేనని వెల్లడించారు. కేంద్రానికి నిధులు సమకూర్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు. కేంద్రం అసలు ఇస్తే కదా.. నిధులు మళ్లించడం జరిగేదని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు కేంద్రం నిధులిస్తోందన్న వాదన మానేయడం మంచిదని సూచించారు.
మీకు వ్యవసాయం రాదు.. తెలివిలేదు అని ఏపీ వాళ్లు అనేటోళ్లు. వాళ్ల నుంచి మనం విడిపోయాం. అయితే వాళ్ల తలసరి ఆదాయం రూ.1.7 లక్షలు. మనది తలసరి ఆదాయం రూ. 2.37లక్షలు. ఒక్కసారి పోల్చుకోండి. కేంద్రం తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది రెట్టింపు. కేంద్రం కూడా మనకంటే ఎక్కువ అప్పులు చేస్తోంది. కేంద్రం ఇస్తుంది అని పిచ్చి లెక్కలు చెప్పకండి. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తారు? రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిందే వస్తుంది తప్ప.. కేంద్రం నుంచి ప్రత్యేకంగా వచ్చేదేమి లేదు. తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది.. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదు.
- కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇవీ చదవండి: