తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నిరోజులు జరగాలన్న దానిపై 24న జరిగే శాసనసభా కార్యకలాపాల కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. హైదరాబాద్‌లో నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగంగా జరపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృద్ధిపై సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి సమావేశంలో సమర్పించాలంది. రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు మరో రూ.100 కోట్లను మంత్రిమండలి కేటాయించింది. రాష్ట్రంలో వర్షపాత వివరాలు, వానాకాలంలో మొత్తం సాగైన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలపై మంత్రిమండలి చర్చించింది. ప్రస్తుత సీజన్‌లో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై ఆరా తీసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లను ఇచ్చింది. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు, వచ్చేఏడాది నుంచి మద్యం దుకాణాల్లో కల్లు గీత(గౌడ) సామాజికవవర్గం వారికి 15 శాతం, దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం కేటాయింపునకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి విద్యాసంస్థ వినతి మేరకు నారాయణగూడలోని 1261 గజాల స్థలాన్ని, బాలికల వసతి గృహ నిర్మాణానికి మంత్రిమండలి కేటాయించింది.
కరోనాపై విస్తృత చర్చ..
కరోనాపై మంత్రిమండలిలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో మూడోదశ వస్తే.. సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా, పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వైరస్ నిర్మూలనకు ప్రతిరోజూ 3 లక్షల ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని, మంత్రులు, అన్ని స్థాయుల ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యఆరోగ్య వసతుల విస్తరణకు చేపట్టిన నాలుగు కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, కొత్త వైద్య కళాశాలలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని 280 మెట్రిక్ టన్నులకు చేర్చామని, దానిని 550 మెట్రిక్ టన్నులకు పెంచాలని సీఎం ఆదేశించారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా అదుపులో ఉందని, విద్యాసంస్థలు తెరిచిన తర్వాత కూడా వైరస్ కేసుల్లో పెరుగుదల స్పష్టం చేశారు. ఒకవేళ చిన్నపిల్లలకు మహమ్మారి వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నిరకాల ఔషధాలు, ఆక్సిజన్, టెస్ట్ కిట్లు, టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు 2.56 కోట్ల డోసులు అందించామని, వారిలో 1.45 కోట్లు మొదటి డోసు, 55.36 లక్షల రెండేసి డోసులను ఇచ్చామన్నారు. రూ.133 కోట్లతో పడకలు, మందులు, ఇతర సామగ్రి సమకూర్చుకున్నామన్నారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం ప్రత్యేకంగా 5200 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.
ఉపసంఘాల నియామకం..
* పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనల కోసం సత్యవతి రాథోడ్ ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉపసంఘాన్ని మంత్రిమండలి నియమించింది. ఇందులో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, అజయ్‌కుమార్ సభ్యులుగా ఉంటారు.
* కొత్తగా ఏర్పడినజిల్లాల్లో పోలీస్ స్టేషన్లలోని సమస్యలు, అవసరాలను సమీక్షించేందుకు హోంమంత్రి మహమూద్‌అలీ నేతృత్వంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానానికి అనుగుణంగా పోలీసు శాఖలో చేపట్టాల్సిన తీసుకోవాల్సిన చర్యలను సమీక్షిస్తారు.
ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారాల కోసం మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డిలతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.